టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్నారంటూ చాలాకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా టీడీపీకి దూరంగా ఉంటున్న గంటా వైసీపీలో చేరతారన్న ప్రచారం జరగడం…దానిని గంటా ఖండించడం జరుగుతోంది. అలా అని గంటా టీడీపీ కార్యక్రమాల్లోగానీ, వాడీవేడిగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో గానీ, పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీతో వాడీవేడీగా జరుగుతున్న మాటల యుద్ధంలో గానీ వేలు పెట్టలేదు.
మంత్రి అవంతి శ్రీనివాస్ తోపాటు పలువురు విశాఖ వైసీపీ నేతలు గంటా రాకను తీవ్రంగా వ్యతిరేకించడం వల్లే వైసీపీలో గంటా చేరిక ఆలస్యమవుతోందని టాక్. ఈ విషయం టీడీపీ నేతలకూ తెలియడంతో అటు టీడీపీలో ఇమడలేకే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్నది మరో కారణం అని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలోనే విశాఖ స్టీల్ ప్రైవేటికరణ అంశం తెరపైకి రావడంతో సందట్లో సడేమియా అంటూ తన పదవికి గంటా రాజీనామా చేశారని అంటున్నారు.
ప్రధానికి జగన్ లేఖ రాయడంపై ప్రశంసలు కురిపించి జగన్ ను పొగిడిన గంటా… ఆ తర్వాత కొన్నాళ్లకు మెల్లగా జగన్ ను కలిసి మెడలో వైసీపీ కండువా వేసుకొని వల్లభనేని వంశీ, కరణం బలరాంలా ఉండాలని ఫిక్సయ్యారని టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రచారానికి ఊతమిచ్చేలా వైసీపీలో గంటా చేరికపై రాజ్యసభ్యుడు విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
గంటా శ్రీనివాసరావు గతంలో కొన్ని ప్రతిపాదనలు పంపించారని, వాటిని పార్టీ ఆమోదిస్తే వైసీపీలో చేర్చుకుంటామని షాకింగ్ కామెంట్లు చేశారు. వైసీపీ సర్కార్, జగన్ చేస్తున్న అభివృద్ధి చూసి గంటా ఆకర్షితుడయ్యారని అన్నారు. అంతేకాదు, టీడీపీ నుంచి మరిన్ని వలసలు ఉంటాయని కూడా విజయసాయి చెప్పడం చర్చనీయాంశమైంది..తాజాగా విజయసాయి వ్యాఖ్యలు విశాఖ వైసీపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. కొన్ని నిర్ణయాలు కొంతమందికి నచ్చవచ్చు..నచ్చకపోవచ్చు అంటూ విజయసాయి వ్యాఖ్యానించారు.
అవి అవంతిని ఉద్దేశించి చేసినవిగానే ఉన్నాయన్న చర్చ జరగుతోంది. అదీగాక, టీడీపీ నేత కాశీ విశ్వనాథ్ చేరికకూడా అవంతికి ఇష్టం లేనట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా…త్వరలోనే గంటా పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నారని విజయసాయి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. మరి, ఈ క్రమంలో గంటాను ముందే పార్టీ నుంచి చంద్రబాబు సస్పెండ్ చేస్తారా…లేక పార్టీకి రాజీనామా చేసేవరకు వేచి చూస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.