గెలిచింది 23 సీట్లు. అందులో అమ్ముడుపోయినోళ్లు నలుగురు. ఉన్నోళ్లయినా వుంటారో? వూడుతారో తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీలో పదవులకు తీవ్రమైన పోటీ నెలకొంది.
మరోవైపు గన్నవరం..వరం తమకివ్వాలంటూ చాలా మంది టిడిపి నేతలు, ద్వితీయశ్రేణి నేతలు, యువకులు పోటీలు పడుతున్నారు.
టిడిపి టికెట్‌పై గెలిచిన వైసీపీకి అమ్ముడుపోయిన వల్లభనేని వంశీ క్రిమినల్, బ్లాక్మెయిల్, దౌర్జన్య చరిత్ర తెలిసి కూడా టికెట్ వస్తే పోటీచేసి సత్తా చాటేందుకు తహతహలాడుతుండటం టిడిపిలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
టిడిపి ఎమ్మెల్యేగా గెలిచి హైదరాబాద్‌లో వందల కోట్ల ఆస్తుల కోసం అమ్ముడుబోయిన వంశీపై వైసీపీ అభ్యర్థిగా ఓడిపోయిన యార్లగడ్డ వెంకటరావు, వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డ దుట్టా రామచంద్రరావులంతా వైసీపీకి పనిచేస్తారు.
అధికారబలమూ వుంది. ఇంతటి స్ట్రగుల్ వున్నా.. టిడిపి టికెట్‌పై పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న నేతల లిస్టు రోజు రోజుకీ పెరిగిపోతోంది.
గన్నవరం స్థానిక టిడిపినేతలు, విజయవాడ సిటీ నాయకులు, నాన్ లోకల్ వాళ్లు కూడా ఎన్నికలొస్తే గన్నవరం టిడిపి టికెట్, లేదంటే టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు తమకే దక్కాలని ఎవరికి వారే విపరీతంగా ప్రయత్నిస్తున్నారు.
బిసి సామాజికవర్గానికి చెందిన టిడిపి సీనియర్ నేత ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గన్నవరం నియోజకవర్గంలోని వివిధ మండలాలలో కేడర్‌తో సత్సంబంధాలున్నాయి.
అర్జునుడిని గన్నవరం టిడిపి ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వాలని మండల టిడిపి నేతలు కోరుతున్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని రామాంజనేయులు గన్నవరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత, మిల్స్ యూనియన్ పరిచయాలు కలిసి వస్తాయని, పార్టీ కేడర్‌లోనూ మంచి పట్టు వుండటంతో గన్నవరం టిడిపి ఇన్చార్జి పదవి ఆశిస్తున్నారు.
బీసీ సామాజికవర్గానికి ముద్రబోయిన వెంకటేశ్వరరావు 2004లో గన్నవరం నియోజకవర్గంలో ఇండిపెండెంటుగా గెలిచి , కాంగ్రెస్ కు అనుబంధ సభ్యుడిగా ఉన్నారు.
2014 ఎన్నికలకు ముందు టిడిపిలో చేరి , నూజివీడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వంశీ రాజీనామా చేసి ఉప ఎన్నికలొస్తే ముద్రబోయిన వెంకటేశ్వరరావు టిడిపి టికెట్ తనకిస్తే గెలిచి చూపిస్తానంటున్నారు.
అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసీని లీడ్ చేస్తున్న కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ టిడిపి టికెట్ ఇస్తే వంశీపై పోటీకి సై అంటున్నారని వార్తలొస్తున్నాయి.
కృష్ణా జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని చందు కూడా గన్నవరం బరిలో దిగి పొలిటికల్ అరంగేట్రం చేయాలని ఉవ్విళ్లూరుతున్నారని సమాచారం.
దేవినేని కుటుంబానికి గన్నవరం నియోజకవర్గంతో ఉన్న బంధుత్వాలు, వల్లభనేని వంశీపై టిడిపికి ఉన్న కోపం అంతా కలిసి గన్నవరంలో తనకు కలిసొస్తుందని ..ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడానికి సంక్షోభ సమయమే సరైనదని తన ప్రయత్నాలు మొదలు పెట్టారు.
తెరపైకి వచ్చిన పేర్లే చాంతాడంత వుంటే.. తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్న వారు ఇంకెంత మంది వున్నారో అని ఆశ్చర్యపోతున్నారు టిడిపి పెద్దలు.
టిడిపి ఖాళీ అయిపోతోందని వైసీపీ పెద్దలు ప్రకటనలు చేస్తుంటే.. టిడిపి పదవుల కోసం, గన్నవరం టికెట్ కోసం ఈ రేంజ్ పోటీ చూసి పార్టీలో జోష్ కనిపిస్తోంది.
ఓ వైపు అధికారపక్షం 151 సీట్లు చాలవన్నట్టు, ఒక్కో ఎమ్మెల్యేని కొనుక్కుంటూ పోతున్నా.. టిడిపి నాయకుల్లో ఆత్మస్థైర్యం సడలలేదు సరికదా! తెలుగుదేశం సత్తా చాటాలనే మరింత పట్టుదల పెరగడంతోనే గన్నవరం టిడిపి సీటు హాటు హాటుగా మారింది.
టిడిపి టికెట్‌పై గెలిచి వైసీపీలో వుంటూ టిడిపిని తిడుతూ రాజకీయ వ్యభిచారిగా వ్యవహరిస్తున్న వల్లభనేని వంశీకి గెలుపుపై నమ్మకం వుంటే..రాజీనామా ఎందుకు చేయడంలేదనేది రాజకీయ విశ్లేషకులు ప్రశ్న.