మరో గ్యాంగస్టర్ హత్యకు గురయ్యాడు. ఇటీవల కాలంలోదేశంలోని తోపు గ్యాంగ్ స్టర్లు ఏదో ఒక కారణంగా హత్యకు గురవుతున్నారు. యూపీలో అయితే పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తుంటే.. మరికొందరు గ్యాంగ్ వార్ లలో చనిపోతుంటే.. ఇంకొందరు జైళ్లల్లో ప్రత్యర్థుల దాడుల్లో మరణిస్తున్నారు. తాజాగా జరిగిన ఉదంతం మూడో కోవకు చెందింది. ఢిల్లీలోని తీహార్ జైల్లో తాజాగా పేరుమోసిన గ్యాంగ్ స్టర్ టిల్లు తాజ్ పురియాను అతని ప్రత్యర్థులు చంపేశారు. టిల్లు మామూలోడు కాదు. రోహిణి కోర్టు కాల్పుల్లో నిందితుడు.
ఇతడి ముఠా సభ్యులు ఢిల్లీ కోర్టులో తన ప్రత్యర్థి గోగి ని కోర్టులోనే చంపించాడు. సునీల్ మాన్ అలియాస్ టిల్లు తాజ్ పురియా ఢిల్లీలో పేరు మోసిన క్రిమినల్ గ్యాంగ్ కు నాయకత్వం వహిస్తుంటాడు. అతనికి గోగి గ్యాంగ్ కు మధ్య వార్ కొన్నేళ్లుగా ఉంది. దాదాపుగా పదేళ్లుగా వీరి మధ్య వైరం ఉంది. ఈ పదేళ్ల కాలంలో ఈ రెండు గ్యాంగ్ ల మధ్య వైరంతో చోటు చేసుకున్న కోట్లాటల్లో దాదాపుపాతిక మంది వరకు మరణించి ఉంటారని చెబుతారు.
ఇదిలా ఉంటే 2021 సెప్టెంబరు 24న ఢిల్లీలోని రోహిణి కోర్టులో లాయర్ వేషంలో వచ్చిన టిల్లు గ్యాంగ్ సభ్యులు ఇద్దరు గోగిని కోర్టులోనే కాల్చి చంపారు. ఈ ఉదంతంలో గోగి అక్కడికక్కడే మరణించగా.. అతన్ని చంపిన ఇద్దరు హంతకుల్ని పోలీసులు కోర్టులోనే కాల్చి చంపారు. ఈ వ్యవహారంలో అరెస్టు అయిన టిల్లును తాజాగా తీహార్ జైల్లో జరిగిన దాడిలో హతమయ్యాడు.
గోగి వర్గానికి చెందిన దీపక్ తీటర్ టిల్లు మీద ఇనుప రాడ్ తో దాడి చేసిన చంపినట్లుగా పోలీసులు చెబుతున్నారు. దాడితో అపస్మారక స్థితిలో పడి ఉన్న టిల్లును ఆసుపత్రికి చేర్చగా.. అప్పటికే అతను చనిపోయినట్లుగా పోలీసులు నిర్దారించారు. జైల్లో జరిగిన ఈ హత్య గురించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.