కరెన్సీ నోటు చూడగానే మనందరికీ జాతిపిత గాంధీ గుర్తుకు వస్తారు. నోటు విలువ ఎంతైనా ఉండనీగాక…నోటుపై మాత్రం దేశానికి స్వాతంత్ర్యం అందించడంలో కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీ విలువ మాత్రం తగ్గదు. అయితే, అటువంటి మహనీయుడిని తాజాగా కేంద్ర ప్రభుత్వం అవమానించిందని గాంధీజీ ముని మనవడు తుషార్ అరుణ్ గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ/ఈ రూపీ) ఈ రూపీపై మహాత్మా గాంధీ ఫొటో లేకపోవడంపై తన అసంతృప్తిని, ఆగ్రహాన్ని సెటైరికల్ గా ఆయన వెల్లడించారు.
కరెన్సీ నోట్లకు ప్రత్యామ్నాయంగా డిజిటల్ కరెన్సీని సీబీడీసీ (ఈ-రూపీ) పేరుతో ఆర్ బీఐ తీసుకొచ్చింది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న అన్ని రకాల కరెన్సీ నోట్ల డినామినేషన్లలో ఈ-రూపీ అందుబాటులోకి రానుంది. ఈ రూపీతోపాటు కరెన్సీ నోట్లు కూడా చలామణిలో ఉంటాయి. అయితే, డిజిటల్ కరెన్సీపై మహాత్మా గాంధీ బొమ్మను వేయలేదు. దీంతో, బాపూ బొమ్మ వేయనందుకు ఆర్ బీఐకి, భారత ప్రభుత్వానికి తుషార్ ధన్యవాదాలు తెలుపుతూ సెటైరికల్ గా ట్వీట్ చేశారు.
దయచేసి ఆయన ఫొటోని పేపర్ కరెన్సీపైనా తొలగించండి అంటూ ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. అయితే, తుషార్ ట్వీట్ పై కేంద్రం స్పందన సంగతి పక్కనబెడితే నెటిజన్లు కొందరు ఆయనకు వ్యతిరేకంగా ట్వీట్స్ చేస్తున్నారు. ఒక్క గాంధీ ఫొటోనే ఎందుకు వేయాలి?? స్వాతంత్ర్య సమరయోధులందరి ఫొటోలను వేయాల్సిందేనని కొందరు అంటున్నారు. ఈ వ్యవహారంపై కేంద్రం స్పందన ఏవిధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.