అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రజల్ని స్వయంగా కలుసుకోవాలని భావించిన ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ కు చేదు అనుభవం ఎదురైంది. రెండు నెలల వ్యవధిలో దేశంలోని 12 ప్రాంతాలకు వెళ్లి.. ప్రజల్ని స్వయంగా కలుసుకోవాలన్న ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా చేసిన రెండో పర్యటనలోనే ఇలాంటి అనుభవం ఎదురుకావటం షాకింగ్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
అసలేం జరిగిందంటే.. ఆగ్నేయ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లారు మక్రాన్. అక్కడో హైస్కూల్ ను సందర్శించారు. అనంతరం తన కారు వైపు వెళుతుండగా.. పెద్ద ఎత్తున ప్రజలు అక్కడే ఉండి.. అధ్యక్షుల వారిని తమ వైపు రావాలని కోరారు. దీంతో ఉత్సాహంగా వారి వైపు నడుస్తూ.. రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ అక్కడున్న వారికి దగ్గరగా వెళ్లారు. భద్రతా చర్యల్లో భాగంగా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఒక వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇవ్వగా.. అనూహ్యంగా చెంపదెబ్బ కొట్టిన వైనం షాకింగ్ గా మారింది.
మెరుపు వేగంతో భద్రతా సిబ్బంది స్పందించినప్పటికి.. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఈ ఘటన పెను సంచలనంగా మారింది. చెంపదెబ్బ కొట్టిన వ్యక్తితో పాటు.. మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెంప దెబ్బ కొట్టే సమయంలో ‘డౌన్ విత్ మాక్రోనియా.. మోంట్ జోయి సెయింట్ డెనిస్’’ అంటూ నినాదం వినిపించింది. ఇది ఫ్రాన్స్ రాజరిక సమయంలో ఫ్రెంచ్ సైన్యం యుద్ధ నినాదంగా చెబుతున్నారు. దేశాధ్యక్షుడు మాక్రాన్ పై దాడి ప్రయత్నం జరిగినట్లుగా ఫ్రెంచ్ అధ్యక్ష కార్యాలయం ధ్రువీకరించింది.
అయితే.. ఈ దాడి ఎందుకు జరిగింది? చేసిన వారి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? వారెందుకు చేశారు? అన్న ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. దేశాధ్యక్షుడిని చెంపదెబ్బ కొట్టిన ఘటనపై స్థానిక రాజకీయ నేతలంతా తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యం అంటే చర్చ.. చట్టబద్ధమైన అసమ్మతి తెలపటమే కానీ ఇలా చేయి చేసుకోవటం పద్దతి కాదని దేశ ప్రధాని జీన్ కాస్టెక్స్ పేర్కొన్నారు. అధ్యక్షుడికి సంఘీభావం తెలిపేందుకు విపక్ష నేత జీన్ లూక్ మెలెన్ చాన్ కూడా ట్వీట్ చేశారు. తాజా ఉదంతంతో భద్రతా లోపాలు తేటతెల్లమయ్యాయని చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
French President Emmanuel Macron has been slapped by a man during a trip to southeast France pic.twitter.com/7vyYlpuzS2
— TRT World (@trtworld) June 8, 2021
A man slapped French President Emmanuel Macron in the face and shouted ‘Down with Macronia' at a meet-and-greet in southern France https://t.co/kYTSA9wp8p pic.twitter.com/pKJhpUIoy5
— Reuters (@Reuters) June 8, 2021