ప్రముఖ సెర్చ్ ఇంజిన్ ‘గూగుల్’ సంస్థకు ఫ్రాన్స్ భారీ షాకిచ్చింది. కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను గూగుల్ కు 500 మిలియన్ల యూరోలు ( భారత కరెన్సీలో రూ.4,415 కోట్లు) జరిమానా విధించింది. న్యూస్ కాపీరైట్ (news copyright row) నిబంధనల ఉల్లంఘన కింద ఆల్ఫాబెట్ గూగుల్ కు యాంటీ-ట్రస్ట్ వాచ్డాగ్ సంస్థ ఫైన్ వేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఫ్రాన్స్ లోని దేశీయ న్యూస్ పబ్లిషర్లకు సంబంధించి తాత్కాలిక ఆదేశాలను గూగుల్ అమలు చేయకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్టు వెల్లడైంది. APIG, SEPM, AFP వంటి ప్రముఖ న్యూస్ పబ్లిషర్స్ తమ న్యూస్ కంటెంట్ వినియోగంపై రెమ్యురేషన్ కోరాయి. అయితే, దానిపై చర్చించి నిర్ణయం తీసుకోవడంలో గూగుల్ విఫలమైంది. దీంతో, ఆ వ్యవహారంపై వాచ్ డాగ్ యాంటీ ట్రస్ట్ అథారిటీ స్పందించి జరిమానా విధించింది.
ఈయూ కాపీరైట్స్ నిబంధనల ప్రకారం.. మీడియా కంపెనీల కంటెంట్‌ను నిబంధనలకు విరుద్ధంగా గూగుల్‌న్యూస్ వాడుకుంటోందని పేర్కొంటూ 500 మిలియన్ యూరోలను ఫైన్ విధించింది. అయితే, రాబోయే 2 లేదా 3 నెలల్లో వార్తా సంస్థలకు, ఇతర పబ్లిషర్లకు సంబంధించిన వార్తల వినియోగానికి ఎలాంటి రెమ్యురేషన్ గూగుల్ ఇవ్వబోతోందో అన్న ప్రతిపాదనలు పంపాల్సి ఉంది. ఒకవేళ గూగుల్ అలా చేయకపోతే రోజుకు అదనంగా 9 లక్షల యూరోల చొప్పున అదనపు జరిమానా విధించబోతున్నారని తెలుస్తోంది. మరోవైపు ఈ వ్యవహారంపై ఇప్పటివరకూ గూగుల్ అధికారికంగా స్పందించలేదు.