సంక్రాంతికి ఐదు సినిమాలకు థియేటర్లు సర్దుబాటు చేయడం అసాధ్యం కావడంతో చర్చోప చర్చలు, తర్జనభర్జనల అనంతరం ఈగల్ సినిమాను రేసు నుంచి తప్పించారు బాగానే ఉంది. అంతటితో సమస్య పరిష్కారం అయ్యిందా అంటే కాదని చెప్పాలి. ఈ వ్యవహారంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న దిల్ రాజు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదం అవుతుంది. హీరోల రేంజును బట్టి సినిమాల స్థాయిని నిర్దేశించడం.. హనుమాన్ ను చిన్న సినిమాగా పేర్కొంటూ వరుసలో చివర్లో నిలబెట్టడం పట్ల సోషల్ మీడియాలో చాలామంది నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
ఈ చిత్రంలో స్టార్ హీరో లేకపోవచ్చు కానీ సినిమాకు బజ్ అయితే మామూలుగా లేదు. సంక్రాంతి బరిలో ఉన్న మిగతా చిత్రాలకు దీటుగానే నిలిచేలా కనిపిస్తోంది హనుమాన్. అలాంటి సినిమాకు థియేటర్ల కేటాయింపు విషయంలో దారుణమైన అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం.
జనవరి 12న గుంటూరు కారంతో పాటు హనుమాన్ రిలీజ్ కాబోతుండగా థియేటర్ల కేటాయింపులో రెంటి మధ్య భారీ అంతరం కనిపిస్తుంది. హైదరాబాదులో దాదాపు 90 సింగిల్ స్క్రీన్లు ఉంటే అందులో 95 శాతానికి పైగా దిల్ రాజు రిలీజ్ చేస్తున్న గుంటూరు కారంకే కేటాయించడంపై ఇప్పటికే పెద్ద చర్చ జరిగింది. మొన్నటి ప్రెస్ మీట్లో కూడా ఈ విషయంపై విలేకరులు అడుగుతుంటే సమాధానం దాటవేశాడు దిల్ రాజు. అయితే హనుమాన్ కు ఎలాగోలా కొంత న్యాయం జరుగుతుందని అనుకుంటే అలాంటి సంకేతాలు ఏమి కనిపించడం లేదు.
ఈ సినిమాకు హైదరాబాద్ మొత్తంలో కేవలం నాలుగు అంటే నాలుగు థియేటర్లు మాత్రమే కేటాయించినట్లు తాజా కబురు. ఆ నాలుగు కూడా పాత డొక్కు థియేటర్లు కావడం గమనార్హం. సికింద్రాబాద్ లోని అంజలి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సప్తగిరి, కాచిగూడలోని కుమార్, బాలానగర్ లోని విమల్.. ఇవి హనుమాన్ కు తొలి రోజు కేటాయించిన స్క్రీన్లు. ఆ తర్వాత కూడా ఇవే కొనసాగే సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండో రోజు నుంచి గుంటూరు కారం నుంచి స్క్రీన్లు తీసి సైంధవ్, నా సామిరంగా చిత్రాలకు ఇవ్వబోతున్నారు. మొత్తంగా హనుమాన్ చిత్రానికి దారుణమైన అన్యాయం జరిగేలాగే కనిపిస్తుంది.