వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు అవినీతికి పాల్పడిన నేతలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఒక్కొక్కరి అంతు తేల్చేస్తుంది. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు జైలు పాలవగా.. తాజాగా మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడదల రజిని చిక్కుల్లో పడ్డారు. పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానులపై బెదిరింపులకు పాల్పడి వారి నుంచి రూ. 2.20 కోట్లు అక్రమంగా వసూల్ చేశారన్న అభియోగాలతో విడదల రజిని, ఐసీఎస్ అధికారి పల్లె జాషువాపై కేసు నమోదు చేసేందుకు ఏసీబీ రెడీ అయింది.
ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ విడదల రజిని అక్రమ వసూళ్లపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించింది. శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ ఓనర్ లను విడదల రజనీ, ఐపీఎస్ జాషువాలు బెదిరించారని.. రూ.5కోట్లు డిమాండ్ చేసి, చివరకు రూ.2.20 కోట్లు వసూలు చేశారని నివేదికలో పేర్కొంది. ఆ మొత్తం అక్రమ సొమ్ములో రజిని రూ.2 కోట్లు, జాషువా రూ.10 లక్షలు, రజిని పీఏ రూ.10 లక్షలు తీసుకున్నారని విజిలెన్స్ తేల్చడంతో.. కేసు నమోదుకు అవసరమైన అనుమతులు కోసం ఏసీబీ అధికారులు ప్రయత్నాలు షురూ చేశారు.
ఈ అక్రమ వసూళ్ల కేసులో ఐపీఎస్ అధికారి జాషువాను విచారించేందుకు చీఫ్ సెక్రటరీ నుంచి అనుమతి తీసుకుని ఏసీబీ అధికారులు.. తాజాగా విడదల రజినీని కూడా విచారించేందుకు అనుమతి కోరుతూ గవర్నర్ కు లేఖ రాశారు. ఈ లేఖపై ఒకటిరెండు రోజుల్లో గవర్నర్ నుంచి అమోదం లభించే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే విడదల రజినిపై కేసు నమోదు చేయడం ఖాయమవుతుంది.