ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు గత కొద్ది రోజుల నుంచి అధికార పార్టీ టీడీపీ లో చేరేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అటు వైపు నుంచి సానుకూల స్పందన రావట్లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలుద్దామని ప్రయత్నించినా కూడా కుదర్లేదు. అయితే రెండు రోజుల క్రితం ఏపీలో వరద బాధితులను అదుకునేందుకు శిద్దా రాఘవరావు ముందుకు వచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షలు విరాళాన్ని ప్రకటించారు.
సీఎంఆర్ఎఫ్ విరాళం పేరుతో చంద్రబాబును కలిసి శిద్దా.. ఇదే మంచి సమయమని భావించి తన మనసులో ఉన్న మాట బయటపెట్టేశారట. శిద్దాపై బాబుకు సైతం ఎటువంటి వ్యతిరేకత లేకపోవడంతో.. టీడీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇన్సైడ్ జోరుగా టాక్ నడుస్తోంది. త్వరలోనే శిద్దా రాఘవరావు టీడీపీ గూటికి చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
గ్రానైట్ వ్యాపారిగా స్థిరపడిన శిద్దా రాజకీయ ప్రస్థానం టీడీపీలోనే ప్రారంభమైంది. 1999లో టీడీపీలో చేరి వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన.. 2007లో అదే పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఎంపికయ్యాడు. అందరినీ కలుపుకొనిపోతూ అజాతశత్రువు గా పేరు తెచ్చుకున్న శిద్దా.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి తొలిసారి శాసనసభ్యునిగా ఎన్నిక అవ్వడమే కాకుండా చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన మంత్రిమండలిలో చోటు దక్కించుకున్నారు.
2019లో ఒంగోలు టీడీపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత.. ఆయనపై వైసీపీ తీవ్ర వేధింపులకు పాల్పడింది. శిద్దా గ్రానైట్ వ్యాపారాలకు వందల కోట్లు ఫైన్లు వేసింది. ఆ ఫైన్లను రద్దు చేయించుకునేందుకు టీడీపీని వీడిన శిద్దా.. వైసీపీలో చేరారు. ఇక 2024 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని శిద్దా భావించినా.. జగన్ ఆయనకు టికెట్ కేటాయించలేదు. ఎన్నికల అనంతరం వైసీపీకి గుడ్ బై చెప్పేసిన శిద్దా రాఘవరావు ఇప్పుడు మళ్లీ సొంత గూటికే చేరనున్నారని అంటున్నారు.