అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారణకు హాజరు కాకుండా పోలీసులతోనే ఆటలు ఆడుతున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ లో అక్రమ తవ్వకాలు, రూ. 250 కోట్లు విలువ చేసే ఖనిజం రవాణా, పేలుడు పదార్థాల నిల్వకు సంబంధించిన వ్యవహారంలో కాకాణిపై కేసు నమోదు అయింది. ఈ కేసులో ఏ4గా ఉన్న కాకాణి పోలీసులకు సహకరిస్తాను, విచారణకు హాజరవుతానని చెబుతూనే తప్పించుకుని తిరుగుతున్నారు.
నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి విచారణకు రావాలని మూడుసార్లు జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. కానీ ప్రతిసారి కాకాణి విచారణకు డుమ్మా కొడుతూనే వచ్చారు. బుధవారం హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని నివాసంలో కాకాణి ఉన్నారని పక్కా సమాచారంతో నెల్లూరు పోలీసులు వెళ్లారు. అయితే ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్న కాకాణి.. పోలీసులు వస్తున్నారన సమాచారంతో అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. కనీసం ఫోన్ లో కూడా అందులోబాటులోకి రాకపోవడంతో పోలీసులు కాకాణి బంధువులకు నోటీసులు ఇచ్చారు.
అక్రమ మైనింగ్ కేసులో ఏప్రిల్ 3న నెల్లూరు రూరల్ డీఎస్పీ ఎదుట కచ్చితంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈ రోజు కూడా కాకాణి విచారణకు రాలేదు. అంతుముందు రెండుసార్లు కూడా ఇదే తంతు జరిగింది. కాకాణిని కలిసి నోటీసులు ఇవ్వాలని పోలీసులు ప్రయత్నించిన ప్రతీసారి ఆయన తప్పించుకుని తిరుగుతున్నారు. మూడోసారి కూడా ఇదే రిపీట్ కావడంతో పోలీసుల తదుపరి చర్యలు ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. విచారణకు సహకరించకపోవడంతో కాకాణి అరెస్ట్ ఖాయమన్న ప్రచారం కూడా జరుగుతోంది.
కాగా, కాకాణి గోవర్ధన్ రెడ్డి పై అక్రమ మైనింగ్ కేసుతో పాటు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు అయ్యింది. పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న కాకాణి.. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నేడు ఏపీ హైకోర్టులో మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ మరియు క్వాష్ పిటీషన్లపై విచారణ జరగబోతుంది.