ఒక వైపు తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. అయితే.. ఈ ఎన్నికలకు ముందుగానే..
బీజేపీ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఇతర పార్టీల నుంచి వచ్చేవారు.. లేదా.. ఇప్పటికే తటస్థంగా ఉన్నవారిని తమవైపు తిప్పుకొని.. పార్టీలో ఊపు పెంచుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ సొంత జిల్లా కడపకు చెందిన సీనియర్లను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు సాగుతున్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ సీనియర్ నాయకుడు డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డిని.. బీజేపీలో చేర్చుకునేందుకు రాష్ట్ర నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు.
రాష్ట్ర విభజన వరకు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండి.. తర్వాత.. తటస్థంగా మారిన కొందరిని తమ పార్టీలోకి చేర్చుకుని తిరుపతి ఎన్నికకు బూమ్ తేవాలని.. తాము పటిష్టం అవుతున్నామని చెప్పుకొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండడం గమనార్హం. ఈ క్రమంలోనే డీఎల్ రవీంద్రారెడ్డి వైపు కమలనాథులు దృష్టి పెట్టారని తెలుస్తోంది.
కడపలోని మైదుకూరు నియోజకవర్గం నుంచి ఐదు సార్లు విజయం సాధించిన డీఎల్.. కాంగ్రెస్ హయాంలో ఆయన మంత్రి కూడా అయ్యారు. అయితే.. రాష్ట్ర విభజన తర్వాత.. మాత్రం ఆయన రాజకీయాలకు దూరమయ్యారనే చెప్పాలి. కొన్ని రోజులు వైసీపీలోకి వెళ్తారని.. ఆహ్వానాలు అందాయని ప్రచారం జరిగింది. కానీ, ఆయన వైసీపీ జోలికి పోలేదు.
ఇక, గత ఎన్నికలకు ముందు.. టీడీపీ నుంచి ఆహ్వానాలు అందాయని.. పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ, ఆదిశగా కూడా డీఎల్ ముందుకు సాగలేదు. దీంతో 2014, 2019 ఎన్నికల్లో డీఎల్ తటస్థం గానే ఉండిపోయారు.
ఇక, ఇప్పుడు ఆయనను తమ పార్టీలోకి చేర్చుకోవాలని భావించిన బీజేపీ నేతలు.. ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని రంగంలోకి దింపింది. ఈయనకు , డీఎల్‌కు మధ్య కాంగ్రెస్‌లో ఉన్న నాటి నుంచి కూడా మంచి సఖ్యత ఉన్న నేపథ్యంలో ఆది ద్వారా బీజేపీ నేతలు చక్రం తిప్పుతున్నట్టు సమాచారం.
బీజేపీ సీనియర్ల సూచనల మేరకు ఆది ఇప్పటికే డీఎల్‌తో చర్చించారని తెలుస్తోంది. అయితే.. ఇప్పటికిప్పుడు కాకుండా.. వేచి చూసే ధోరణిలో డీఎల్ ఉన్నట్టు సమాచారం. కానీ, తిరుపతి ఎన్నికలకు రెండు రోజుల ముందు డీఎల్ రావాలని.. పార్టీలో ప్రాధాన్యం ఇస్తామని రాష్ట్ర నేతలు రాయబారాలు నడుపుతున్నారని తెలుస్తోంది. మరి ఆయనేమో.. ఆలోచనలో ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి.