తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. మరీ.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ పండుగకు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ముచ్చటగా మూడు రోజులు పండుగను జరుపుకోవటం ఒక ఎత్తు అయితే.. ఈ పండక్కి సొంతూరు వెళ్లటం ఆనవాయితీ. ఏడాది మొత్తం ఎలా ఉన్నా.. సంక్రాంతికి మిస్ కాకుండా ఊరికి వెళ్లి రావటానికి ఏపీ ప్రజలు పడే ఆరాటం అంతా ఇంతా కాదు. ఈసారి సంక్రాంతి స్పెషల్ ఏమంటే.. భోగి సోమవారంతో మొదలవుతున్నా.. సెకండ్ శాటర్ డే రావటంతో మూడు రోజుల పండుగ కాస్తా.. ఐదు రోజులైంది.
సంక్రాంతికి పండక్కి ఉన్న మరో ప్రత్యేకత.. ఏపీ ప్రజలు ఎక్కడున్నా.. ఈ పండక్కి సొంతూరు రావటం.. తన వాళ్లను కలిసేందుకు.. వారితో ఈ పండుగను గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తారు. సంపాదన అంతంత మాత్రం ఉన్న వారు సైతం.. ఏదోలా పొదుపు చేసి మరీ.. ఈ పండుగ కోసం ఊరికి వెళ్లేందుకు సిద్ధమవుతారు. ఈసారి సెలవులు మరింత పెరగటంతో.. రెగ్యులర్ గా వెళ్ల వారికి రెండింతలు ఊళ్లకు వెళ్లేందుకు రెఢీ అయిపోయారు.
ముందస్తు ప్లానింగ్ తో నెలల క్రితమే ట్రైన్ టికెట్లు రిజర్వు చేసుకున్న కొద్దిమందిని మినహాయిస్తే.. మిగిలిన వారంతా ఊరికి చేరేందుకు పలు మార్గాల్ని వెతికిన పరిస్థితి. చివరకు డబ్బులు ఎక్కువైనా ఫర్లేదని ఊళ్లకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రైవేటు బస్సుల టికెట్ ధరలు భారీగా పెరిగిపోయాయి. రోటీన్ ఛార్జీలకు నాలుగైదు రెట్లు వసూలు చేసిన పరిస్థితి.
ఈ క్రమంలో ఫ్లైట్ టికెట్లను బుక్ చేయటం మొదలు పెట్టారు ప్రజలు. వాటి ధరలు సైతం రాకెట్ వేగంగా పెరిగిపోయాయి.శనివారం నాటికి హైదరాబాద్, బెంగళూరు నుంచి విశాఖపట్నంకు వచ్చేందుకు విమాన టికెట్ల ధరల్ని చూసిన వారికి షాక్ తింటున్నారు.
ఎందుకుంటే.. శని.. ఆదివారాల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి విమానంలో చేరుకోవాలంటే ఛార్జీ రూ.17,500లకు పైనే ఉంది. బెంగళూరు నుంచి విశాఖకు అయితే రూ.12 వేలు పెడితే కానీ టికెట్లు దొరకని పరిస్థితి. సాధారణ రోజుల్లో హైదరాబాద్.. బెంగళూరు నుంచి రూ.3500 నుంచి రూ.4వేల మధ్యలో ఉండగా.. సంక్రాంతి పుణ్యమా అని మూడు నాలుగు రెట్లు పెరిగిపోవటం గమనార్హం. సంక్రాంతికి సొంతూరు వెళ్లాలన్న ఆత్రుతతో.. వేల రూపాయిల్ని లెక్క చేయకుండా ఊరికి వెళుతున్న వారెందరో. వారి అవసరాన్ని మరీ ఇంతలా సొమ్ము చేసుకోవాలా? అన్నది ప్రశ్న.