రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చాలా అంశాల్లో ఏపీ కంటే తెలంగాణ నాలుగైదు అడుగులు ముందుంటుంది. అదే సమయంలో.. ఏపీ ప్రతి విషయంలో వెనుకబడి ఉంటుంది. అయితే.. విమానాశ్రాయాల విషయానికి వస్తే.. మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి.
తెలంగాణలో హైదరాబాద్ శివారులోని శంషాబాద్ తప్పించి.. సాధారణ ప్రయాణికులకు మరో ఎయిర్ పోర్టు లేని పరిస్థితి. దీనికి భిన్నంగా ఏపీలో మాత్రం విశాఖ నగరంలో లో అంతర్జాతీయ విమానాశ్రయం,.. విజయవాడ (గన్నవరం)లో అంతర్జాతీయ విమానాశ్రయం.. తిరుపతి (రేణిగుంట).. కడప.. రాజమండ్రి పలు ఎయిర్ పోర్టులు ఉన్నాయి.
వీటికి త్వరలో కర్నూలు కూడా యాడ్ కానుంది. ఇన్ని ఎయిర్ పోర్టులు ఉన్నా.. శంషాబాద్ లాంటి భారీ ఎయిర్ పోర్టు లేదన్న కొరత మాత్రం ఏపీకి మిగిలిపోయింది. ఎన్ని ఎయిర్ పోర్టుల ఉంటే మాత్రం ఏం లాభం.. శంషాబాద్ ముందు ఎంత? అన్న ప్రశ్నలో నిజముందని చెప్పక తప్పదు. అయితే.. అంతర్జాతీయ విమానాశ్రయ కోరిక తీరేందుకు వీలుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఒకసారి అందుబాటులోకి వచ్చాక.. పరిస్థితుల్లో మార్పు ఉంటుందని చెబుతారు.
ఇదిలా ఉంటే.. తాజాగా కర్నూలు నగర శివారులో ఏర్పాటు చేసిన విమానాశ్రయాన్ని ఈ దసరాకు ఓపెన్ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన అనుమతులు వచ్చేసినట్లుగా తెలుస్తోంది ఉడాన్ పథకం కింద కర్నూలు నుంచి విజయవాడ.. విశాఖపట్నం.. బెంగళూరుకు సర్వీసులు నడపటానికి కర్నూలు ఎయిర్ పోర్టు సిద్ధమవుతోంది.
ట్రూ జెట్ విమానయాన సంస్థ.. కర్నూలు నుంచి విమాన సర్వీసుల్ని నడపనుంది. అంతేకాదు.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులకు సంబంధించి శంకుస్థాపన వచ్చే నెల జరుగుతుందని.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. తాజా సమాచారం కర్నూలు.. ఉత్తరాంధ్ర వాసులకు మరింత హ్యాపీ కలిగిస్తుందని చెప్పక తప్పదు.
కొసమెరుపు ఏంటంటే…. ఈ కర్నూలు ఎయిర్ పోర్టును చంద్రబాబు ప్రభుత్వం కేవలం 18 నెలల్లో కట్టేసి రికార్డు సృష్టించింది. ఇపుడు దసరాకు పబ్లిక్ కి అందుబాటులోకి తేనున్నారు.
ఏపీలో శంషాబాద్ విమానాశ్రయంతో ఢీకొనేలా భోగాపురం, గన్నవరం అభివృద్ధి చేయాలన్న బాబు ఆలోచనకు ఎన్నికలు అడ్డుకట్ట వేశాయి.