`ఆడలేనివాడు.. మద్దెల ఓడు` అన్నాడని సామెతగా మన పెద్దలు చెబుతుంటారు. ఇక, ఇప్పుడు త్వరలో ఏపీ ప్రభుత్వం ఈ సామెతను సంపూర్ణంగా అమలు చేయనుందనే వ్యాఖ్యలు మేధావుల నుంచి వినిపిస్తు న్నాయి. తాను చేయగలిగితే.. తన చేతనైతే.. నేనే ఇండ్రుణ్ని, చంద్రుణ్ని.. అని చెప్పుకొనే నాయకులు ఉన్న ఈ రోజుల్లో తాము చేయలేంది ఏదైనా ఎదురైతే.. అంతే నిర్భీతిగా ఒప్పుకొంటారని ఆశించడమూ కష్టమే.
సరే! విషయంలోకి వస్తే.. పోలవరం ప్రాజెక్టుకు కష్టాలు తప్పడం లేదు. ఎప్పుడో 2010నాటికే పూర్తవుతుందని చెప్పిన వైఎస్ దీని విషయంలో ఒక అడుగు ముందుకు వేసినా.. చోటు చేసుకున్న అవినీతి మాత్రం పనుల వేగాన్ని తగ్గించేసింది.
ఫలితంగా చంద్రబాబు హయాం వరకు పనులు సాగు..తూనే ఉన్నాయి. చంద్రబాబు హయాంలో అత్యధిక పనులు జరిగాయి. నిజానికి ఇక కేవలం 21 శాతం పనులే ఉన్నాయి. ఇక, ఇప్పుడు జగన్ వంతు వచ్చింది. ఇంకే ముంది మా హయాంలో పరుగులు పెట్టిస్తాం.. 2021 చివరి నాటికి నీటినితోడేస్తాం.. అంటూ..మంత్రి అనిల్ కుమార్‌యాదవ్ పలుసందర్భాల్లో గంభీర ప్రకటనలు చేశారు.
అయితే, ఇప్పుడు ఇది నత్తను మించి నెమ్మదిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. పోలవరం బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయానికి ముందు ఉన్న 23 వేల కోట్ల రూపాయలకు కుదించేసింది. దీనికి ఒప్పుకోవాల్సిందేనని షరతుపెట్టినట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఇప్పుడు పెరిగిపోయిన వ్యయం నేపథ్యంలో ఇది సాధ్యం కాదనేది అందరికీ తెలిసిందే.
అయినా కూడా కేంద్రం పట్టించుకోవడం లేదు. అప్పట్లో మీరు పూర్తి చేస్తానంటే.. మేం కాదన్నామా? అంటూ ఎదురు ప్రశ్నిస్తోంది. అంతేనా.. ఈ 23 వేల కోట్లకు ఒప్పుకోక పోతే, ఇచ్చే సొమ్మును కూడా నిలిపి వేస్తాం అంటూ హెచ్చరిస్తోంది. దీంతో ఇప్పుడుజగన్ ముందున్న పరిష్కారం ఏమిటి? ఆయన ఎంత అడుగుతున్నారు? అనే ప్రశ్నలు తెరమీదకి వచ్చాయి. కనీసం మీరు 15 వేల కోట్లయినిఇవ్వడం పూర్తి చేసుకుంటాం అంటున్నారు. కానీ, మీరు ఇప్పటికే ఖర్చు చేసిన 2 వేల కోట్ల ను ఇస్తాం. అదేసమయంలో 23 వేల కోట్లరూపాయల్లో బకాయి ఉన్న 4 వేల కోట్లను ఇస్తామని కేంద్రం తెగేసి చెబుతోంది.
ఇక, ఈ నిధులతో ఎలూగూ పోలవరం పూర్తయ్యే అవకాశం లేదు. దీంతో జగన్ ఈ పాపం మొత్తాన్ని గత సర్కారుపై నెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించేసింది. నాడు చంద్రబాబు చేసిన తప్పుల కారణంగా పోలవరం లేటైంది కాబట్టే, కేంద్రం నిధులు ఇవ్వనని చెబుతోంది.. అని ఎదురు దాడి చేసేస్తోంది.
నిజానికి అప్పటి ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ నేతలు చేసిన రాద్ధాంతం ఒక్కసారి గుర్తు చేసుకుంటే.. పోలవరానికి శత్రువులు ఎవరో ఇట్టే అర్ధమవుతుంది. నాడు ఖర్చులు పెరిగిపోతున్నాయని.. పనులు క్లిష్టంగా ఉన్నాయని.. పునరావాసం ఖర్చు 2013 నాటి భూ సేకరణ చట్టంతో అమాంతం పెరిగిపోయాయని .. చంద్రబాబు నెత్తీనోరూ కొట్టుకున్నారు.
మీరే స్వయంగా వచ్చి పరిశీలించి.. ఖర్చులు లెక్కగట్టమని.. అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అనేక మార్లు విన్నవించిన తర్వాత.. పోలవరం వ్యయంపై మరోసారి లెక్కలు పంపుతూ.. 55 వేల కోట్ల పైచిలుకును ఖర్చు ను చూపించారు. నాడే జగన్ దీనికి మద్దతుగా గళం వినిపించి తాను కూడా సహకరించి ఉంటే.. కేంద్రం ఖచ్చితంగా ఒప్పుకొనేదే. కానీ, ఆయన ఆనాడు.. ఇంత ఖర్చు అవసరం లేదు. బాబు దోచుకునేందుకు ఇలా పోలవరం వ్యయంఅంచనాలను పెంచేశారంటూ.. కేంద్రానికి లేఖ రాశారు. దీంతో ఈ వ్యయంపెంపుపై కేంద్రం నాన్చుడు ధోరణిని అవలంబించి.. నాడు మీరే 23 వేల కోట్లు చాలన్నారు కదా! అని నేడు ప్రశ్నించింది.
అంతేకాదు, ఒక్క పైసా కూడా ఎక్కువ ఇచ్చేది లేదని తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు జగన్ పాలిట శాపంగా మారింది. తాను చేసిన బూమరాంగ్కు తనే బలికావాల్సి వచ్చిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ.. ఎదురుదాడిని మించిన రాజకీయ వ్యూహం లేదుకాబట్టి.. కేంద్రాన్ని పట్టి నిలదీసే సత్తా కూడా లేదుకాబట్టి.. ఇప్పుడు చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నారు తప్ప.. వాస్తవానికి పోలవరం అంచనా వ్యయంపై నాడే జగన్‌కు నిజాలు తెలుసు. కానీ, బాబును ఇరికించబోయి.. ఇప్పుడు తానే ఇరుక్కున్నారు. మరి ఎలా బయట పడతారో చూడాలి.