ఒక్క మాట మాత్రం నిజం.. ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి థియేటర్ల ద్వారా సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారు ? అని గగ్గోలు పెట్టేవాళ్లకు సినిమా హీరోల రెమ్యునరేషన్లు, వాళ్ల బిజినెస్ మోసాలు.. కలెక్షన్ ట్రిక్కులు… పార్కింగ్ ఫీజులు, బ్లాక్ టిక్కెట్ల దందా కనిపించలేదా ? అన్నదే పెద్ద ప్రశ్న. వకీల్‌సాబ్ సినిమా టైంలో జగన్ ప్రభుత్వం టిక్కెట్ల రేట్లను భారీగా సవరించింది. దీంతో 1990వ దశకంలో ఏ రేట్లు అయితే ఉన్నాయో అదే రేట్లను మాత్రమే అమలు చేయాలని సీరియస్‌గా వార్నింగ్ ఇవ్వడంతో పాటు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇక ఇప్పుడు టిక్కెట్ల రేట్లు భారీగా తగ్గించేలా నిర్ణయం తీసుకుంటూ కొత్త జీవో రావడంతో ఇండస్ట్రీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఈ పరిస్థితి మారపోతే ఏపీలో థియేటర్ల వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, ఇండస్ట్రీ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. ఒకప్పుడు ఏపీలో టాప్ థియేటర్లుగా ఉన్నవి .. ఇప్పుడు కళ్యాణ మండపాలుగా.. షాపింగ్ కాంప్లెక్సులుగా, గోడౌన్లుగా మారిపోయాయి. ఇక ఇప్పటికే ఓటీటీ దెబ్బతో థియేటర్ల వ్యవస్థ కుదులవుతోందనుకుంటే.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల రేట్ల విషయంలో తీసుకున్న నిర్ణయంతో ఏపీలో పలు థియేటర్లను మూసివేత.. కమర్షియల్ కాంప్లెక్సులు, కళ్యాణ మండపాలుగా మార్చే నిర్ణయాలు తీసేసుకున్నారు.
సరే ఇక్కడ చాలా మంది ఏపీలో జగన్ పాలనలో టిక్కెట్ల రేట్లు తగ్గించడం సరే… ఒక్క నిత్యావసర వస్తువు రేటు అయినా తగ్గిందా ? అని ప్రశ్నిస్తున్నారు. ఇందులో ఇండస్ట్రీని సపోర్ట్ చేసే వాళ్లే చాలా మంది ఉన్నారు. కానీ వినోదం ఈ రోజు సామాన్యుడికి అందని ద్రాక్షగా మారింది. పార్కింగ్ ఫీజులు, లోపల స్నాక్స్ ఫీజుల్లో కూడా భారీ దోపిడి జరుగుతోంది. దీని గురించి మాట్లాడే వాళ్లు ఉండరు. ఇక హీరోలు, దర్శకుల రెమ్యునరేషన్లు చుక్కలను అంటుతున్నాయి. ఇక్కడ టిక్కెట్ల రేట్లు తగ్గుతున్నాయంటారే కాని.. వాళ్లు తమ రెమ్యునరేషన్ తగ్గించుకుని ప్రేక్షకుడికి తక్కువ రేటుకు వినోదం ఇద్దామన్న ఆలోచన అస్సలే చేయరు. అసలు దోపిడీ వ్యవస్థ అనేది హీరోల రెమ్యునరేషన్లు పెంచడం నుంచే ప్రారంభమవుతుంది అనేది కొందరి వాదన..!
ఇక ఇండస్ట్రీ వాళ్లు చేసిన తప్పు మరొకటి ఉంది. పదే పదే హైదరాబాద్‌లో ఉంటూ సీఎం కేసీఆర్‌ను కలుస్తున్నారే తప్పా… ఏపీలో కూడా తెలుగు సినిమా ఉంది.. తెలుగు సినిమాకు వచ్చే రెవెన్యూలో 60 – 65 శాతం మార్కెట్ ఏపీ నుంచే వస్తుందన్నది వాళ్లు ఆలోచిస్తారా ? అన్నది వాళ్లకే తెలియాలి. ఏపీ నుంచి సినిమా కలెక్షన్లు కావాలే కాని.. అక్కడ సీఎంను కలిసే తీరిక మాత్రం వీళ్లకు ఉండదన్నట్టుగా వీరు వ్యవహరించిర తీరు కూడా జగన్‌లో ఇండస్ట్రీపై ఓ అసహనానికి కారణమై ఉండొచ్చు…! ఏదేమైనా ఇటు జగన్ ఓ మెట్టు దిగాలి.. అటు సినిమా వాళ్లు ఏపీ విషయంలో తెలంగాణతో సమానంగా ఉండాలి.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది..!