ఇది ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తున్న ప్రశ్న. వరుస వరదలతో వ్యవసాయం కునారిల్లుతోంది. కేవలం 18 నెలల జగన్ పాలనలో 467 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలుగుదేశం నేత నారా లోకేష్ ఆరోపించారు. అకాల వర్షాలు, వరదలతో సర్వం కోల్పోతున్న కౌలు రైతుల కష్టాలు ఎవరికీ పట్టడం లేదు. వారికి ప్రభుత్వం సాయమూ అందడం లేదు. అందునా కులమతాలను చూస్తోంది జగన్ ప్రభుత్వం.
కులం చూడం మతం చూడం అని చెప్పే జగన్ … కౌలురైతుల సాయాన్ని ఓసీలకు ఇవ్వరట. ఇదెక్కడి న్యాయమో మరి. పంట పండించే రైతు ఏ మతం అయితే ఏంటి? ఏ కులం అయితే ఏంటి… హిందు ఓసీ కౌలు రైతులకు మాత్రమే కౌలు సాయం అందడం లేదని ఆరోపణలు రావడం నిజంగా విచారకరం. విపత్తు ఓసీ రైతులకు రాదా… ఓసీ రైతులు మాత్రం పంట డబ్బులు పోగొట్టుకోవడానికి వేస్తాడా? ఎందుకు ప్రభుత్వాలు ఇలా ఆలోచించవో మరి. అసలు అంత మంది సలహాదారులున్న జగన్ కి ఓసీ రైతులను మినహాయించే సలహా ఏ చెత్త బుర్ర నుంచి వచ్చిందో మరి.
తాజాగా గుంటూరు జిల్లా, కాకుమాను మండలం, పెద్దివారిపాలెం గ్రామంలో కౌలు రైతు హరిబాబు ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన అప్పులు చేసి 12 ఎకరాల్లో పత్తి, 2ఎకరాల్లో మిర్చి సాగు చేశారట. నివర్ తుఫాను కారణంగా 6 లక్షలు నష్టపోయారట. ప్రభుత్వం నుండి ఎటువంటి భరోసా లభించకపోవడంతో ఆత్మహత్యకి పాల్పడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి .కౌలు రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి అని నారా లోకేష్ డిమాండ్ చేశారు.
రైతు వ్యవసాయం వదిలేస్తే ప్రజలకు ఆహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. మరి అపుడు ఎక్కడి నుంచి తెస్తారు ఆహారాన్ని? అందుకే రైతు అన్యాయం కాకుండా ప్రభుత్వాలు పక్షపాత రహితంగా రైతులను ఆదుకోవాలి. లేకపోతే మొదటికే ముప్పు. ఎద్దు ఏడ్చిన పొలం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అంటారు. మరి చూడాలి ఇక నైనా ప్రభుత్వం మేల్కొంటుందో లేదో.