కరోనా కష్టకాలంలో సామాన్యుల పాలిట బాలీవుడ్ విలన్ సోనూ సూద్ రియల్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. కరోనా ఫస్ట్ వేవ్ లో వలస కార్మికులకు బస్సులు ఏర్పాటు చేసి స్వస్థలాలకు పంపింది మొదలు కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసే వరకు సోనూ సూద్ పేరు నిత్యం వార్తల్లో వినిపిస్తూనే ఉంది. తనకు చేతనైనంతలో ఆర్థిక సాయం చేస్తూనే మరోవైపు కొంతమంది యువతకు ఉద్యోగాలు కూడా కల్పించిన ఈ విలన్ కమ్ హీరో ఎందరికో స్ఫూర్తి ప్రదాత అయ్యాడు…మరెందరికో హీరో అయ్యాడు. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు చెందిన వెంకటేశ్ కూడా సోనూసూద్ ను చూసి స్ఫూర్తి పొందాడు.
దీంతో, తన స్ఫూర్తి ప్రదాత సోనూసూద్ ను ఎలాగైనా కలవాలని నిర్ణయించుకున్న వెంకటేశ్… వికారాబాద్ నుంచి కాలినడకన బయల్దేరి 700 కిలోమీటర్లు ప్రయాణించి ముంబై చేరుకున్నాడు. తనను ఇన్ స్పైర్ చేసిన రియల్ హీరోను చూడడానికి కాలికి చెప్పులు లేకుండా 700 కిలో మీటర్లు ప్రయాణించాడు. ‘ది రియల్ హీరో సోనూ సూద్.. నా గమ్యం.. నా గెలుపు.. అని రాసి ఉన్న ప్లకార్డు పట్టుకొని ముంబైకి చేరుకున్నాడు. తనకోసం అంత సాహసం చేసిన వెంకటేశ్ ను సోనూ సూద్ తన నివాసంలో కలుసుకున్నాడు. వెంకటేశ్ తో ఫొటో దిగి, అతడి స్థితిగతులపై ఆరా తీశాడు సోనూ సూద్.
ఈ విషయాన్ని సోనూ సూద్ స్వయంగా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా వెంకటేశ్ అంతదూరం నడిచి రావడం పట్ల రియల్ హీరో సోనూసూద్ చలించిపోయారు. మార్గమధ్యంలో ముంబై వచ్చేందుకు సోనూసూద్ ప్రయాణ ఏర్పాట్లు చేసినా సరే…వెంకటేశ్ సున్నితంగా తిరస్కరించాడని సోనూసూద్ వెల్లడించారు. వెంకటేశ్ అభిమానం తనను నిజంగా మంత్రముగ్ధుడ్ని చేసిందని, కానీ, ఇకపై దయచేసి ఎవరూ ఇలాంటి పనులు చేయొద్దని, కష్టాలను కొని తెచ్చుకోవద్దని అభిమానులకు ఈ రియల్ హీరో విజ్ఞప్తి చేశారు. సోనూ సూద్ కోసం తెలంగాణ అభిమాని చేసిన సాహసం వైరల్ అయింది.