అభిమానుల పవర్ స్టార్, ఆంధ్రుల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. ఇక పుట్టినరోజు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1971 సెప్టెంబర్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ బాపట్లలో కొణిదెల వెంకటరావు, అంజనాదేవి దంపతులకు మూడవ కుమారునిగా పవన్ కళ్యాణ్ జన్మించాడు. అతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు.
పవన్ కళ్యాణ్ అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు. అయితే తన పబ్లిక్ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలలోని ఒకదాంట్లో `పవన్` అనే పురస్కారాన్ని అందుకున్నారు. అప్పటి నుంచి కళ్యాణ్ బాబు కాస్త పవన్ కళ్యాణ్ గా మారారు. సోదరుడు చిరంజీవి పేరున్న తెలుగు నటుడు కావడంతో పవన్ కళ్యాణ్ చుట్టూ ఎప్పుడూ సినిమా వాతావరణం ఉండేది. కానీ నటుడు కావాలని మాత్రం పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కోరుకోలేదు.
చదువుల్లో అంతంత మాత్రమే అయినా.. కరాటేలో పవన్ బ్లాక్ బెల్ట్ సాధించారు. హీరో కాకముందు పవన్ కళ్యాణ్ డైరెక్టర్ అవ్వాలని కోరుకున్నారు. డైరెక్షన్ పై మంచి ఆసక్తి కలిగి ఉండటంతో.. ఆ దిశగా అడుగులు వేయాలనుకున్నారు. కానీ అందుకు చిరంజీవి సతీమణి సురేఖ అడ్డుపడ్డారు. పవన్ కళ్యాణ్ ను తెర వెనక కాదు తెరపై చూడాలని సురేఖ భావించారు. అందులో భాగంగానే సినిమాల్లో నటించేందుకు పవన్ కళ్యాణ్ ను బలవంతంగా సురేఖ ఒప్పించారు.
వదిన మాట కాదనలేక 1996లో `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` సినిమాతో హీరోగా పవన్ కళ్యాణ్ వెండితెరపై అడుగుపెట్టారు. రెండవ చిత్రం `గోకులంలో సీత`తో పవన్ ఫస్ట్ హిట్ అందుకున్నాడు. తొలి ప్రేయ, ఖుషి, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది వంటివి పవన్ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రాలు. ఇక పవన్ యాక్టింగ్ కు మాత్రమే పరిమితం కాకుండా దర్శకుడిగా, కొరియోగ్రాఫర్ గా, స్క్రీన్ రైటర్ గా, సింగర్ గా, స్టంట్ కో-ఆర్డినేటర్ గా, రైటర్ గానూ పని చేశారు. ప్రస్తుతం రాజకీయవేత్తగా సైతం సత్తా చాటుతున్నాడు.