మీరు చదివింది కరెక్టే. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రఖ్యాత సోషల్ మీడియా నెట్ వర్కు కంపెనీ ఫేస్ బుక్ మాత్రు సంస్థ ’మెటా’ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. కంపెనీ చరిత్రలో మొదటిసారి భారీ స్థాయిలో ఉద్యోగుల్ని ఇంటికి పంపేందుకు సిద్ధమైంది.
మెటా సంస్థలోని వివిధ శాఖలకు చెందిన దాదాపు 12 వేల మందిని ఇంటికి పంపేలా చర్యలు చేపట్టారు. ఇప్పటికే గత మే నుంచి ఉద్యోగుల రిక్రూట్ మెంట్ ను నిలిపివేసిన ఫేస్ బుక్.. తాజాగా ఉన్న ఉద్యోగుల్లో కూడా కోత పెట్టేందుకు సిద్ధం కావటంతో సంస్థలో పని చేసే ఉద్యోగుల మీద తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
ఇంతకీ.. ఇంత భారీగా ఉద్యోగుల్ని తీసేయాలని ఫేస్ బుక్ ఎందుకు నిర్ణయించింది? మార్క్ జుకర్ బర్గ్ ఆలోచన ఏమిటన్న విషయంలోకి వెళితే.. ఉద్యోగాల్లో సామర్థ్యం కనిపించని వారిని తీసేయాలన్నదే లక్ష్యమని చెబుతున్నారు.
పెరుగుతున్న ఖర్చుల్ని అదుపు చేయటంతో పాటు.. ఇటీవల కాలంలో మనీ ఫ్లో తగ్గిపోవటం.. వడ్డీ రేట్లు పెరగటం లాంటి కారణాలతో పాటు.. రానున్న రోజుల్లో మహా మాంద్యం పొంచిఉందన్న అంచనాలు కూడా తాజా నిర్ణయానికి కారణంగా చెబుతున్నారు.
ఇటీవల జుకర్ బర్గ్ మెటా ఎర్నింగ్స్ కాల్ లో మహా వేటు విషయాల్ని వెల్లడించారు. అంతేకాదు.. గత మేలో నిలిపివేసిన నియామకాల్ని మరికొంత కాలం అదే విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అనుకున్నంతగా తమ సామర్థ్యాన్ని ప్రదర్శించని 15 శాతం ఉద్యోగుల్ని ఇంటికి పంపేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఫేస్ బుక్ తీసుకున్నట్లుగా చెబుతున్న నిర్ణయం అమల్లోకి వస్తే.. మరిన్ని కంపెనీలు ఇదే బాటన పడతాయని చెబుతున్నారు. అదే జరిగితే.. టెకీ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్ మొదలు కావటం ఖాయమంటున్నారు. మహా ఆర్థిక మాంద్యం అన్న అంచనాలు వెలువడుతూ ఆందోళన పెంచుతున్న వేళలోనే.. ఫేస్ బుక్ లాంటి సంస్థలు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు ఇప్పుడు టెకీలలో టెన్షన్ ను పుట్టిస్తున్నాయి.