గన్నవరంలో భారీ ఎత్తున రగడ చోటు చేసుకుంది. పార్టీ కార్యాలయాన్ని.. వైసీపీకి చెందిన నేతలు.. ఎమ్మె ల్యే వంశీ అనుచరులు తగల బెట్టారని సాక్షాత్తూ చంద్రబాబు నాయుడే విమర్శించారు. తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఇక, రాత్రికి రాత్రి హైదరాబాద్ నుంచి ఆయన కదిలి వచ్చారు. మరి ఇన్ని పరిణామాలు చోటు చేసుకుంటే.. తెలుగు దేశం శ్రేణులు ఏం చేశారు? రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు ఏం చేశారు? ఇదీ.. ఇప్పుడు ప్రశ్న.
ఏదో కొందరు నాయకులు మీడియా ముందుకు వచ్చారు. ఏదో మాట్లాడారు. మళ్లీ గంటకు అందరూ టీవీల ముందుకు చేరిపోయారు. అంతా టీవీల్లోనే చూస్తూ.. కూర్చున్నారు. అదేమంటే.. తమను పోలీ సులు బయటకు రానివ్వలేదని.. రానిస్తే..తఢాకా చూపిస్తామని కామెంట్లు కుమ్మరించారు. నిజానికి కొందరిని.. పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కానీ, అనంతపురం, చిత్తూరు, కడప, నెల్లూరు వంటి జిల్లాల్లో ఎక్కడా పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు.
దీంతో ఆయా జిల్లాల్లో టీడీపీ నేతలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ.. నాయకులు ఒక్కరూ కూడా మనస్పూర్తిగా బయటకు రాలేదు. ఏదో చంద్రబాబు కోసమో.. లేక మీడియాలో కనిపించ డం కోసమో.. ఇలా వచ్చి అలా మాట్లాడి వెళ్లిపోయారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. వైఎస్ జగన్పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తి దాడి జరిగింది.. గుర్తుందా? ఆ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది.
అయితే.. దీనికి నిరసనగా.. రాష్ట్రం నలుమూలలా వైసీపీ నేతలు బయటకు వచ్చేశారు. పోలీసులను దాటుకుని.. రోడ్డెక్కి ధర్నాలు చేశారు. జాతీయ రహదారులు కొన్ని గంటల పాటు స్తంభించి పోయాయి. స్వయంగా జగన్ జోక్యం చేసుకుని.. విరమించాలని చెప్పేవరకు రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి. మరి ఈ తరహా స్ఫూర్తి టీడీపీలో ఎందుకు కనిపించడం లేదు..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. సో.. ఇన్ని జరిగినా.. మారని తమ్ముళ్ల ఇకపై మారుతారని అనుకోవడం భ్రమేనని అంటున్నారు పరిశీలకులు.