కర్ణాటక శాసనసభ ఎన్నికలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో గెలుపు కోసం అధికార పార్టీ బీజేపీతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా హోరాహోరీగా తలపడింది. కర్ణాటకలో మరోసారి కాషాయ జెండా ఎగురవేసేందుకు స్వయంగా ప్రధాని మోడీ సైతం రంగంలోకి దిగి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఇక, చాలా కాలం నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న సోనియాగాంధీ సైతం తమ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించడం విశేషం.
బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ప్రజలు ఈసారి కాంగ్రెస్ కు పట్టం కడతారని కొన్ని సర్వేలు సంచలన నివేదికలను వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బిజెపికి షాక్ ఇచ్చేలా ఉన్నాయి. కన్నడ నాట కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేస్తుందని మెజారిటీ సర్వేలు చెబుతుండటంతో హస్తం పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి బిజెపి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ అధికారాన్ని కైవసం చేసుకునేంత మ్యాజిక్ ఫిగర్ దక్కదని సర్వేలలో వెల్లడైంది.
గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా జెడిఎస్ అధినేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కింగ్ మేకర్ అవుతారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ సారి తాను కింగ్ మేకర్ కాదని, కింగ్ అని కుమార స్వామి అంటున్నారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు:
పీపుల్స్ పల్స్ : కాంగ్రెస్ 107 -119, బీజేపీ 78-90, జేడీఎస్ 23-29, ఇతరులు 1-3
సువర్ణ న్యూస్-జన్ కీ బాత్: కాంగ్రెస్ 91-106, బీజేపీ 94-117, జేడీఎస్ 14-24, ఇతరులు 0-2
న్యూస్ నేషన్-సీజీఎస్: కాంగ్రెస్-86, బీజేపీ-114, జేడీఎస్-21, ఇతరులు-3
టీవీ9 భరత్వర్ష్-పోల్స్ట్రాట్: కాంగ్రెస్ 99-109, బీజేపీ 88-98, జేడీఎస్ 21-26, ఇతరులు 0-4
రిపబ్లిక్ టీవీ-పీ మార్క్యూ: కాంగ్రెస్ 94-108, బీజేపీ 85-100, జేడీఎస్ 24-32, ఇతరులు 2-6
జీ న్యూస్-మ్యాట్రిజ్: కాంగ్రెస్ 103-118, బీజేపీ 79-94, జేడీఎస్ 25-33, ఇతరులు 2-5
ఏబీపీ-సీఓటర్: బీజేపీ 66-86, కాంగ్రెస్ 81-101, జేడీఎస్ 20-27, ఇతరులు 0-3
పోల్ ఆఫ్ పోల్స్: కాంగ్రెస్ 103, బీజేపీ 94