మాజీ ఎంపీ, సీనియర్ పొలిటిషియన్ ఉండవల్లి అరుణ్ కుమార్ కు మంచి మాటకారి, విశ్లేషకుడు, నిష్పక్షపాత విమర్శకుడు… అంటూ జనాల్లో రకరకాల బిరుదులున్నాయి. వాటికి తగ్గట్టే ఉండవల్లి కూడా గోడమీద పిల్లి వాటంగా జగన్ కు అనుకూలంగా చాలా సార్లు, ప్రతికూలంగా కొన్నిసార్లు విమర్శలు గుప్పిస్తూ అడపాదడపా మీడియా సమావేశాలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలోని ఉద్యోగుల పీఆర్సీ రచ్చపై కూడా ఉండవల్లి ఓ లేఖ విడుదల చేయడం చర్చనీయాంశమైంది.
ఒకపక్క కరోనా బీభత్సం సృష్టిస్తోందని, మరొక పక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక దుస్థితిని దృష్టిలో పెట్టుకుని సమ్మెను ఆపాలంటూ ఉద్యోగ సంఘాలను ప్రార్థించారు ఉండవల్లి. కొత్త పీఆర్సీ అమలు వల్ల జగన్ సర్కార్ పై రూ.10,247 కోట్ల అదనపు భారం పడుతుందని గుర్తు చేశారు. తక్కువ మొత్తంలో పెంచిన జీతాలు వద్దని ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగుతున్నాయని, పెంచిన జీతాలు వద్దని సమ్మెకు దిగడం తాను మొదటిసారి చూస్తున్నానని అన్నారు. ఈ పరిస్థితులలో సమ్మె ఆపాలని, ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు పట్టింపులకు పోకుండా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఉండవల్లి రిక్వెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఉండవల్లిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పెంచిన జీతాలు వద్దంటూ సమ్మె చేయడంపై ఉండవల్లి చెబుతున్నారని, కానీ, జీతాలు తగ్గుతున్నాయని ఉద్యోగులు గోల పెడుతున్న విషయాన్ని మరిచి ప్రభుత్వానికి అంత అర్జెంటుగా ఉండవల్లి జాకీలెందుకు వేస్తున్నారంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. వైఎస్ఆర్ భక్తుడైన ఉండవల్లి..జగన్ కు కూడా అజ్ఞాత మద్దతుదారుడన్న అసలు రంగు అందరికీ తెలుసని విమర్శిస్తున్నారు. ఈ మధ్య ఉండవల్లి మారారని అంతా అనుకున్నారని, కానీ ఉద్యోగుల విషయంలో జగన్ కి ఉండవల్లి జై కొట్టడంతో ఊసరవెల్లి…ఉండవల్లి అసలు రంగు మరోసారి బయటపడిందని అంటున్నారు.
అసలు చరిత్రలో ఏ సర్కారు అయినా జీతాలు పెంచుతుంది లేకుంటే…పాత జీతాలనే కొనసాగిస్తుంది. కానీ, నభూతో న భవిష్యత్ అన్నట్లుగా జీతాలు తగ్గించడం ఎక్కడైనా ఉంటుందా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయం బాగా పెరిగిందని, చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని సాక్షి చేత జగన్ రాయిస్తుంటే ఉండవల్లేమో జగన్ సర్కార్ కష్టాల్లో ఉందనడం విడ్డూరంగా ఉందని చురకలంటిస్తున్నారు.
తన మాటకారితనంతో ఇన్ని సుద్దులు చెబుతున్న ఉండవల్లి…అదే నోటితో ఉచితంగా పప్పు బెల్లాల్లా పంచిపెడుతున్న సంక్షేమ పథకాలు ఆపమని చెప్పొచ్చుగా అని నిలదీస్తున్నారు. ఉద్యోగుల జీతాలే ఎందుకు తగ్గించాలి? ఉత్తినే డబ్బులు పంచే పథకాలు ఆపితే చాలుగా అంటూ సెటైర్లు వేస్తున్నారు. రేషన్ డెలివరీ వ్యాన్లకు పెట్టిన డబ్బులు మిగుల్చుకోవచ్చు కదా అంటూ నిలదీస్తున్నారు. ఇలాంటివి ఉండవల్లికి కనిపించినా…బయటకు చెప్పరని, ఎందుకంటే ఉండవల్లి ఎప్పుడూ వైఎస్ కుటుంబానికి వీర భక్తుడని, జగన్ కి ఓటు పడే ఐడియాలిస్తారు గాని జగన్ ఓట్లు పోయే అయిడియాలు ఎందుకు ఇస్తారని నెటిజన్లు పంచ్ ల మీద పంచ్ లు వేస్తున్నారు.