వన్ నేషన్- వన్ ఎలక్షన్ కాన్సెప్ట్‌ను కేంద్ర ప్రభుత్వం తెరపైకి తీసుకురావడంతో 2027 నాటికి జమిలి ఎన్నికలు జరగొచ్చని బలంగా విశ్వసిస్తున్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. పార్టీని బలోపేతం చేసేందుకు బీభత్సమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పార్టీలో భారీగా మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జెండా మార్చేస్తున్న వారిని పట్టుంచుకోకుండా తనవెంట నడిచే పలువురు సీనియర్ నాయకులకు రాష్ట్రస్థాయి పదవులు ఖరారు చేస్తున్నారు. తమ వాగ్ధాటితో ప్రత్యర్ధులపై విరుచుకుపడే నేతలను పార్టీ అధికార ప్రతినిధులుగా నియమిస్తున్నారు.
తాజాగా సీనియర్ నాయకుడు, లోక్‌సభ మాజీ సభ్యుడు గోరంట్ల మాధవ్ కు జగన్ కీలక బాధ్యతలు అప్పజెప్పారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా గోరంట్ల మాధవ్ ను నియమించారు. గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లా పార్టీ నేతలతో సమావేశం అయిన జగన్.. ఆ వెంటనే అదే జిల్లాకు చెందిన గోరంట్ల మాధవ్‌ను వైసీపీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
కాగా, గోరంట్ల మాధవ్ కు కాంట్రవర్సీ మాధవ్ అనే మరొక పేరు కూడా ఉంది. స్వతహాగా ఈయన రాజకీయ నాయకుడు కాదు. రాజకీయాల్లోకి రాకముందు అనంతపురం జిల్లాలో సీఐ గా బాధ్యతలు నిర్వహించారు. ఖాకీ యూనిఫాంలో ఉన్నప్పటి నుంచే ఎన్నో వివాదాలకు చిరానామా నిలిచారు. తాడిపత్రిలో జరిగిన ఓ వివాదంలో పోలీసులపై జేసీ దివాకర్ రెడ్డి చేసిన విమర్శలకు కౌంటర్‌గా పోలీస్ డ్రెస్‌లోనే గోరంట్ల మాధవ్ మీసం మెలెసి జగన్ కంట్లో పడ్డారు.
సామాజికవర్గం కూడా కలసి రావడంతో జగన్ ఆయనకు పార్టీలో ప్రధాన్యత కల్పించారు. దాంతో ఉద్యోగం మానేసి వైసీపీలో చేరిన గోరంట్ల మాధవ్.. 2019 ఎన్నికల్లో హిందూపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి అత్యంత భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత ఐదేళ్ల ఆయన లీలలు ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఒకానొక సందర్భంగా జగన్ సైతం గోరంట్లను పక్కన పెట్టేయాలని భావించారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అయితే హిందూపురం లోక్‌సభ టికెట్‌ను దక్కించుకున్న జొలదరాశి శాంత.. టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథి చేతుల్లో ఘోరంగా ఓడిపోయారు. ఈ పరిణామాల నడుమ జగన్ మళ్లీ గోరంట్ల మాధవ్‌ను నమ్ముకున్నారు. పార్టీలో మళ్లీ ఆయన్ను యాక్టివ్ చేసేందుకు తాజాగా కీలక బాధ్యతలు అప్పజెప్పారు.