గుడివాడలో క్యాసినో వ్యవహారం కొద్ది రోజుల క్రితం ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానికి చెందిన ఎన్ కన్వెన్షన్ లో క్యాసినో, పోకర్, పేకాట, గోవా నుంచి వచ్చిన చీర్ గాళ్స్ తో అసభ్యకర డ్యాన్స్ లు నిర్వహించారని టీడీపీ నేతలు వీడియోలు, ఫ్లైట్ వివరాలతో సహా ప్రూవ్ చేసి నానిని కార్నర్ చేశారు. అయితే, తన ఫంక్షన్ హాల్ లో ఏమీ జరగలేదని నాని బుకాయించారు.
అయితే, నానికి చెందిన ఎన్ కన్వెన్షన్ లో ఆ కార్యక్రమాలు జరగలేదని, కొడాలి నానికి చెందిన ఎన్ కన్వెన్షన్ పక్కనే ఉన్న స్థలంలో ప్రతి ఏటా మాదిరిగానే సంక్రాంతి సంబరాల శిబిరాన్ని తమ మ్యూచువల్ ఫ్రెండ్స్ నిర్వహించిన మాట వాస్తవమేనని వైసీపీ అప్రకటిత నేత, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అంగీకరించారు. ఇలా, వైసీపీ నేతలు చాలా చోట్ల పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ అనపర్తి నియోజకవర్గ అబ్జర్వర్, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పేకాడుతూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన వైనం హాట్ టాపిక్ గా మారింది. దీంతో, సుబ్బారావుపై ఏపీ గేమింగ్ యాక్ట్ 3 అండ్ 4 ప్రకారం సెక్షన్ 275 కింద కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ లో సుబ్బారావు ఏ9 ఉన్నారు. గత నెల 26న పేకాడుతూ పట్టుబడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీరామచంద్రమూర్తి ఇంట్లో పేకాడుతూ సుబ్బారావుతోపాటు మరో 8 మంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఓ మాజీ ఎమ్మెల్యే, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే స్థాయి నేతపై పోలీసులు పేకాట కేసు నమోదు చేయడం విశేషం. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుబ్బారావు…2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి అదే పార్టీలో కొనసాగుతున్నారు.