అందరూ ఊహించినట్లుగానే తన గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై సౌందర రాజన్ ఈరోజు బీజేపీలో చేరారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో తమిళిసై కాషాయ కండువా కప్పుకున్నారు. గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పని చేసిన తమిళిసై రాబోయే లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసేందుకే తన గవర్నర్ పదవికి రాజీనామా చేశారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే తాజాగా ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. నాడార్ సామాజిక వర్గానికి చెందిన తమిళిసై నాడార్ ఓటింగ్ ఎక్కువగా ఉన్న చెన్నై సౌత్, తిరునల్వేలి, కన్యాకుమారి లోక్ సభ నియోజకవర్గాలలో ఏదో ఒక దాని నుంచి పోటీ చేయబోతున్నారని టాక్ వస్తోంది.
తమిళి సై బీజేపీ ఎంపీగా బరిలోకి దిగేందుకే గవర్నర్ పదవికి రాజీనామా చేయడంపై డిఎంకేతో పాటు కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ వ్యాఖ్యలపై అన్నామలై స్పందించారు. ఉన్నత పదవులకు రాజీనామా చేసిన తర్వాత ప్రజాక్షేత్రంలో సాధారణ పౌరులుగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కేవలం బీజేపీలోనే సాధ్యమని అన్నారు. మిగతా పార్టీలలో ఉన్నత పదవులు వదులుకోవడానికి ఇష్టపడరని, బీజేపీలో మాత్రం ప్రజాసేవే ముఖ్యమని చెప్పుకొచ్చారు. గవర్నర్ గా తమిళిసై బాగా పనిచేశారని, ఆ పదవికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకోవడం తప్పు కాదని అన్నారు.
ప్రజలపై ఆమెకున్న ప్రేమను ఇది తెలియజేస్తుందని చెప్పుకొచ్చారు. తిరిగి బీజేపీలో చేరడం పార్టీ పట్ల ఆమెకున్న నిబద్ధతకు నిదర్శనం అన్నారు. మోడీని మూడోసారి ప్రధాని చేసేందుకు, ఎన్డీఏను అధికారంలోకి తెచ్చేందుకు దోహదపడాలని ఆమె భావిస్తున్నారని అన్నారు.
మరోవైపు, తెలంగాణ ఇన్చార్జి గవర్నర్ గా ఝార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. రాజ్ భవన్ లోని దర్బార్ హాల్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే…రాధాకృష్ణన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు హాజరయ్యారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా రాధాకృష్ణన్ పని చేయబోతున్నారు. తెలంగాణ తొలి గవర్నర్ నరసింహన్, మాజీ గవర్నర్ తమిళిసై, ప్రస్తుత గవర్నర్ రాధాకృష్ణన్ అందరూ తమిళనాడుకు చెందిన వారు కావడం విశేషం.