ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనట్టుగా..ఒక సుగంధ ద్రవ్యాల వ్యాపారి ఇంట్లో ఏకంగా రూ.257 కోట్ల నగదు.. 25 కేజీల బంగారం.. 250 కేజీల వెండితో పాటు.. మరిన్ని పత్రాలు.. 200 కేజీల గంధం ఆయిల్ పట్టుకున్న వైనం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక సాదాసీదా వ్యాపారిగా మాత్రమే సుపరిచితుడైన ఆయన.. ఆర్థిక మూలాలు ఎంత లోతుగా.. బలంగా ఉన్నాయో తాజా తనిఖీలతో వెల్లడైంది. అన్నింటికి మించి.. వ్యాపారి పీయూష్ జైన్ ఇంట్లో లభించిన క్యాష్ ను లెక్క పెట్టటానికి మిషన్లలోనే నాలుగు రోజులు పట్టిన వైనం దిమ్మ తిరిగిపోయేలా మారింది.
కాన్పూరుకు చెందిన ఈ అత్తరు వ్యాపారి సమాజ్ వాదీ పార్టీకి చెందిన వాడన్న విషయం బయటకు రావటంతో ఇదో రాజకీయ రగడగా మారింది.
అయితే.. ఈ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేస్తున్నారు యూపీ మాజీ సీఎం కమ్ సమాజ్ వాదీ నేత అఖిలేశ్ యాదవ్. తాజాగా రథయాత్రను ప్రారంభించిన సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు విన్న వారంతా అవాక్కు అవుతున్నారు. తాను తీసిన గొయ్యిలో బీజేపీ పడిందన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ప్రస్తుతం అధికారులకు చిక్కిన పీయూష్ జైన్ బీజేపీకి చెందిన వాడని.. ఆయన కాల్ డేటా చూస్తే.. బీజేపీ నేతలతో ఆయన ఎంతలా కాంటాక్టు ఉందన్న విషయం అర్థమవుతుందని చెబుతున్నారు.
వాస్తవానికి పీయూష్ జైన్ కు బదులుగా పుష్పరాజ్ జైన్ ను అధికారులు టార్గెట్ చేశారని.. డిజిటల్ మిస్టేక్ కారణంగా పీయూష్ జైన్ ఇంట్లో దాడులు జరిగాయన్నారు. టీవీ చానళ్లు సైతం తొలుత సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఇంట్లో సోదాలు జరిగినట్లుగా పేర్కొన్నాయని.. ఆ తర్వాత అందులో నిజం లేదని తేలటంతో.. ఆ ప్రసారాల్ని నిలిపివేశారన్నారు. కాన్పూరు వ్యాపారి ఇంట్లో పెద్ద ఎత్తున డబ్బు దొరకటం పెద్దనోట్ల రద్దు.. జీఎస్టీ వైఫల్యాన్ని రుజువు చేస్తున్నాయని చెప్పారు. అఖిలేశ్ వ్యాఖ్యల నేపథ్యంలో పీయూష్ జైన్ ఏ పార్టీకి చెందిన వారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అఖిలేశ్ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ నేతలు ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.