ఎకరాలకు ఎకరాలు మీరే మింగేస్తారా?
మాకేమీ మిగల్చరా?
మాకు నచ్చినవారికి పోస్టులివ్వకుంటే ఎలా?
ఎన్నికల్లో మేం ఖర్చు పెట్టుకోలేదా?
వైసీపీ అధిష్ఠానంపై విశాఖ ఎమ్మెల్యేల గుర్రు
విజయసాయిరెడ్డి తీరుపై ఆగ్రహం
పిలిపించి రాజీచేసిన జగన్
‘పంపకాలు’ ఖరారుచేసుకున్న నేతలు
పరిపాలనా రాజధాని పేరుతో విశాఖ భూములన్నీ స్వాహా చేస్తున్న వైసీపీ పెద్దలకు ఆ జిల్లా ఎమ్మెల్యేలు గట్టి షాకే ఇచ్చారు. భూములు కనబడితే చాలు విజయసాయిరెడ్డి, కడప నేతల బృందం కర్చీఫ్‌లు వేసేస్తుండడం.. వేల ఎకరాలు మింగేస్తుండడం.. తాము కొనుక్కోవాలంటే మాత్రం మోకాలడ్డుతుండడం.. తమకు తెలియకుండా తమ నియోజకవర్గాల్లో సీఐలను, తహశీల్దార్లను నియమించడం.. తమ మాట విలువివ్వకపోవడాన్ని జీర్ణించుకోలేక.. ఒక్కసారిగా విజయసాయిరెడ్డిపై విరుచుకుపడ్డారు. తమ నియోజకవర్గాల్లో ఆయన పెత్తనమేంటని చోడవరం, అనకాపల్లి ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్ బహిరంగంగానే నిలదీశారు. విశాఖ కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో జిల్లా సమీక్ష మండలి సమావేశం ఇందుకు వేదికైంది. తమను అవినీతిపరులుగా చిత్రించడాన్ని ఎమ్మెల్యేలు తప్పుబట్టారు. ఎమ్మెల్యేలమన్న విలువే లేదని.. స్థానిక సీఐలను, తహశీల్దార్లను తమకు తెలియకుండా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. బయటి నుంచి వచ్చినవారి కర్రపెత్తనం సహించేది లేదని.. ఎవరినో తీసుకొచ్చి తమపై రుద్దితే మర్యాదగా ఉండదని తేల్చిచెప్పారు. అంతేగాక.. విశాఖ ఆస్తులను హారతి కర్పూరం చేస్తున్నారని.. నచ్చిన కంపెనీల భూకబ్జాలను ప్రోత్సహిస్తున్నారని.. వివాదరహిత భూములను 22ఏ పరిధిలో చేర్చి.. తాము సెంటు భూమైనా కొనకుండా అడ్డుకుంటున్నారని ఆక్షేపించారు. ఏడాదిన్నరగా నోరెత్తని ఎమ్మెల్ల్యేలు బహిరంగంగా.. అదీ అధికారుల ముందే నిలదీయడంతో విజయసాయిరెడ్డి నీళ్లు నమలాల్సి వచ్చింది. నిజానికి విజయసాయిరెడ్డిపై తిరుగుబాటు చేయడమంటే జగన్‌పై చేసినట్లే! అయినప్పటికీ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గలేదు. ఇది మీడియాలో రచ్చరచ్చ కావడంతో సీఎం జగన్మోహన్రెడ్డి జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఎమ్మెల్యేల్లో ఉన్న అసంతృప్తిని తక్షణమే చల్లార్చకపోతే.. రాష్ట్రమంతా విస్తరిస్తుందని ఆయన ఆందోళన చెందారు. విజయసాయిని, ధర్మశ్రీ, అమర్నాథ్లను తాడేపల్లికి పిలిపించారు. వారి వాదనలు ఆలకించారు. భూముల వ్యవహారంలో ఎమ్మెల్యేలు, ఇతర వైసీపీ నేతల జోక్యానికి సంబంధించి తన వద్ద ఉన్న చిట్టా చూపించి బెదిరించాలని చూశారు. అయితే ఎమ్మెల్యేలు మాత్రం గట్టిగా నిలబడ్డారు. తాము కొత్తగా రాజకీయాల్లోకి రాలేదని.. ఏనాటి నుంచో ఉన్నామని.. ఎమ్మెల్యేలుగా తమ మాటకు విలువివ్వాల్సిందేనని.. భూముల వ్యవహారంలో రాజీపడేది లేదని.. తమ నియోజకవర్గాల్లో తమకూ వాటా ఉండాలని స్పష్టం చేశారు. నియామకాల్లో తమ మాట చెల్లుబాటు కాకుంటే పార్టీలో ఉండి ఉపయోగమేమిటని ప్రశ్నించారు. అన్నిటినీ మించి కాపు సామాజిక వర్గాన్ని అణగదొక్కేందుకు విజయసాయిరెడ్డి అండ్ కో ప్రయత్నిస్తోందని.. ఇది చాలా దూరం వెళ్తుందని అమర్నాథ్ స్పష్టం చేసినట్లు సమాచారం. తాము కొనాలనుకున్న భూములను చుక్కల భూముల జాబితాలో చేర్చి.. కడప నేతలు కావాలనగానే జాబితా నుంచి తొలగిస్తున్నారని.. దీనిని సహించేది లేదని.. జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేల మద్దతు కూడా తమకుందని ధర్మశ్రీ తేల్చిచెప్పారు. వ్యవహారం బాగా ముదిరిందని గ్రహించిన జగన్ వారి మఽధ్య రాజీ కుదిర్చారు.
ఇలా పంచుకుందాం!
అనంతరం విజయసాయిరెడ్డి విశాఖలో జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ‘ఆధిపత్య పోరాటాలు, విభేదాలూ వద్దు! అధికారాన్ని ఇలా పంచుకుందాం’ అంటూ వైసీపీ నాయకత్వం రూపొందించిన ఫార్ములాను వారి ముందుంచారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా స్థాయి నేతల మధ్య ‘అధికార విభజన’ చేశారు. దీని ప్రకారం.. ఇక నుంచి స్థానిక ఎమ్మెల్యే సూచించిన తహశీల్దార్లు, సీఐలనే నియోజకవర్గాల్లో నియమిస్తారు. ఆర్డీవో, డీఎస్పీ స్థాయి అధికారుల నియామకాల కోసం జిల్లా వైసీపీ ఇన్చార్జికి పేర్లు సూచిస్తే.. వారికే ప్రాధాన్యమిస్తారు. ఎమ్మెల్యేలు కోరిన పనులు చేయాలని కలెక్టర్లు, డీఐజీలు, ఎస్పీలకు తక్షణ ఆదేశాలు ఇచ్చారు. స్థానిక సంస్థల కార్పొరేషన్లు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ల శాఖాధికారులకు కూడా ఇవే ఆదేశాలు జారీ చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో ఎంపీ, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సంయుక్తంగా పనులు చేసుకోవాలి. ఇసుక, ల్యాండ్ మ్యుటేషన్లు వంటి వ్యవహారాల్లోనూ ఎమ్మెల్యేల మాట చెల్లుబాటవుతుంది. ప్రైవేటు భూములు, 22ఏ మార్పుల విషయంలో శాసన సభ్యులు జోక్యం చేసుకోవద్దని.. అధికారులపై ఒత్తిడి తీసుకురాకూడదని వైసీపీ తీర్మానించినట్లు చెబుతున్నారు. ఇలా వాటాల పంపకంతో అసమ్మతిని మొగ్గలోనే జగన్ తుంచేసే ప్రయత్నం చేశారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే ఇది తాత్కాలికమేనని.. విజయసాయిరెడ్డి తీరు తెలిసిన ఎమ్మెల్యేలు ఆయన్ను విశ్వసించడం లేదని సమాచారం.
రింగ్ లీడర్ బొత్స..
అయితే ఎమ్మెల్యేల తిరుగుబాటు వెనుక సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నట్లు విజయసాయిరెడ్డి జగన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో.. తర్వాత రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా ఓ వెలుగు వెలిగి.. ఒకానొక దశలో సీఎం పదవిపై ఆకాంక్ష వ్యక్తంచేసిన బొత్స.. ఇప్పుడు సాదాసీదా మంత్రి. ఉత్తరాంధ్రలో.. ఆ మాటకొస్తే సొంత జిల్లా విజయనగరంలో కూడా ఇప్పుడు ఆయన్ను లెక్కచేసే వారే లేరు. రాజధాని అమరావతిపై విషం కక్కడానికి మాత్రమే ఆయన్ను జగన్ వాడుకుంటున్నారు. విశాఖలో కడప నేతల దందాలు చూశాక.. మెజారిటీ ఎమ్మెల్యేలు కలవరపడుతున్నారు. దీనిని సావకాశంగా తీసుకున్న బొత్స.. పలువురు ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉంటూ.. వారికి పెద్దదిక్కుగా మారారని.. అక్రమాస్తుల కేసుల్లో జగన్ జైలుకెళ్లాల్సి వస్తే.. ఆ తరుణంలో రాజకీయంగా తన అవసరమెంత ఉందో వైసీపీ అధిష్ఠానానికి ఇప్పటి నుంచే తెలియజెప్పాలన్న ఉద్దేశంతో ఆయన ఉన్నారని విజయసాయిరెడ్డి అనుమానిస్తున్నారు.