ప్రశాంత విశాఖపై వైసీపీ పడగ

భూముల కబ్జా... కంపెనీలు స్వాధీనం
కొత్త సంస్కృతికి తెరలేపిన పెద్దలు
వాల్తేరు క్లబ్బు భూములు స్వాహా
బే పార్కులో పాగా..
కార్తీకవనమూ మింగేశారు
విలువైన ప్రేమ సమాజం ఆస్తులపై పగ
రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా కూల్చివేతలు
సరిగ్గా సెలవు రోజుల్లోనే కదిలే అధికారులు
అర్ధరాత్రి దాటిన తర్వాత పొక్లెయిన్లకు పని
కోర్టుకు వెళ్లే వీల్లేకుండా కట్టుదిట్టం
ప్రత్యర్థి పార్టీ ఆర్థిక మూలాల ధ్వంసం
పరిపాలనా రాజధాని కాకముందే విశాఖలో వైసీపీ పెద్దలు అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. ప్రశాంత నగరంలో అశాంతి రేకెత్తిస్తున్నారు. ఎక్కడికక్కడ కంపెనీలను చెరబట్టి.. వాటి భూములు మింగేస్తున్నారు. టీడీపీ నేతలు, సానుభూతిపరుల ఆస్తులే లక్ష్యంగా కూల్చివేతలకు తెగబడుతున్నారు. ప్రతి శుక్రవారం అర్ధరాత్రే పొక్లయిన్లు దాడికి కదులుతాయి. టీడీపీ నేతల భవనాలు అక్రమ నిర్మాణాలంటూ వాటిని కూల్చివేస్తుంటాయి. నేతలనే కాదు.. వారి అనుచరులనూ వదలకుండా వేధిస్తున్నారు. లేని లొసుగులు, లోపాలను ఎత్తిచూపిస్తూ.. చివరకు సామాన్యుల ఆస్తులనూ వదలడం లేదు. ప్రశాంతతకు మారుపేరైన, తీర నగరి విశాఖలో ఇప్పుడు ‘అధికార’ అలజడి చెలరేగుతోంది. తగిన గడువుతో ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం కూడా లేకుండా సెలవు రోజుల్లో, అర్ధరాత్రి దాటాక కట్టడాలను కూల్చివేసే అరాచక సంస్కృతికి తెరలేపారు. వ్యాపారాలు చేసుకునే వారిని సైతం ప్రతిపక్ష సానుభూతిపరులుగా ముద్ర వేసి రోడ్డున పడేస్తున్నారు. ఉత్తరాంధ్రపై ‘గుత్తాధిపత్యం’ తనదే అన్నట్లుగా చెలరేగిపోతున్న ఒక కీలక నేతే ఈ విషయాల్లో చక్రం తిప్పుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఈ దందా మొదలైంది. కడప నుంచి వచ్చి ఇక్కడ మకాం వేసిన ముఠా.. ‘రూ.10 కోట్లు ఇస్తే మీ భూమి భద్రంగా ఉంటుంది. లేదంటే... రద్దయిపోతుంది’ అంటూ విశాఖకు చెందిన ఒక వ్యక్తిని బెదిరించింది. న్యాయం తన వైపే ఉందని ఆయన డబ్బులివ్వడానికి నిరాకరించారు. అంతే.. ఆ ముఠా హెచ్చరించినట్లుగానే... భూమిని వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని ద్వారా ‘మేం చెప్పినట్లు వినకుంటే ఏం జరుగుతుందో తెలుసుకోండి’ అనే సంకేతాలు పంపింది.
కంపెనీలూ కబ్జా..
వాల్తేరు క్లబ్‌.. రాజకీయాలతో సంబంధంలేకుండా, విశాఖ నగరానికి చెందిన ఉన్నతస్థాయి వ్యక్తులు దీనిని ఏర్పాటు చేసుకున్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఈ క్లబ్బు భూములపై పెద్దల కన్ను పడింది. వాటిని కొట్టేయడానికి ఏకంగా అడ్వొకేట్‌ జనరల్‌నే ప్రత్యేక విమానంలో విశాఖపట్నం తీసుకొచ్చారు. ఆ భూముల్ని చూపించి, వాటి రికార్డుల్ని అదే విమానంలో తీసుకుపోయారు. ఇదోరకం బరితెగింపు. ఇప్పటిదాకా భూములు కబ్జా చేయడమే చూశాం. విశాఖలో కంపెనీలు, సంస్థలను కూడా కబ్జా చేసే కొత్త సంస్కృతి మొదలైంది. వీఎంఆర్‌డీఏ దగ్గర 33 ఏళ్లకు లీజుకు తీసుకొని బీచ్‌ రెస్టారెంట్‌ (కార్తీకవనం) ఏర్పాటు చేసిన వ్యాపారులను బెదిరించారు. కొన్ని లొసుగులను  అడ్డంపెట్టుకుని... అందులో 50 శాతం వాటాను బలవంతంగా మరో అస్మదీయ కంపెనీకి ఇప్పించారు. ఆ తర్వాత కొన్నాళ్లకే.. రుషికొండలో పర్యాటక శాఖ నుంచి భూమిని లీజుకు తీసుకుని ఏర్పాటు చేసిన బే పార్క్‌ను హస్తగతం చేసుకున్నారు. అదే బీచ్‌ రోడ్డులో ప్రేమసమాజం భూములను లీజుకు తీసుకుని హోటల్‌, రిసార్టు నడుపుతున్న సాయిప్రియ రెస్టారెంట్‌పై కన్నేశారు. దీనిని లాగేసుకోవడానికి ప్రేమ సమాజం ట్రస్టును దేవదాయ శాఖ ద్వారా స్వాధీనం చేసుకున్నారు. భీమిలి మార్గంలో రామానాయుడు స్టూడియోపైనా కన్నేశారు. ఇదే నియోజకవర్గంలో మాన్సాస్‌ ట్రస్టుకు ఉన్న వందల ఎకరాల భూములను కొట్టేయడానికి తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. సింహాచలంలో పంచగ్రామాల భూ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఏడాది క్రితం వేసిన కమిటీలో వైసీపీ కీలక నేత కూడా సభ్యుడిగా నియమితుడయ్యారు. అక్కడి విలువైన భూములను కొట్టేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. విశాఖ జిల్లాలో ఎక్కడెక్కడ విలువైన భూములున్నాయో గుర్తించి, వాటిని దక్కించుకోవడమే లక్ష్యంగా అధికారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
రాజకీయ ప్రత్యర్థులపై దాడులు
విశాఖపట్నం ప్రశాంత నగరం. రాజకీయంగానూ చాలా సుహృద్భావ వాతావరణం కలిగిన జిల్లా ఇది. ఇక్కడి ప్రజాప్రతినిధుల్లో పలువురు ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు. స్థానికేతరులను కూడా ఆదరించే స్వభావం ఉన్నందునే... టి.సుబ్బిరామిరెడ్డి, ఎంవీవీఎస్‌ మూర్తి, నేదురుమల్లి జనార్దన రెడ్డి, గంటా శ్రీనివాసరావు, దగ్గుబాటి పురందేశ్వరి, కంభంపాటి హరిబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంవీవీ సత్యనారాయణ, వెలగపూడి రామకృష్ణబాబు వంటి వారు ఇక్కడి నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యారు. రాజకీయంగా ప్రత్యుర్థులైనప్పటికీ నాయకులంతా కలిసి మెలసి ఉంటారు. ఇప్పుడీ వాతావరణం పూర్తిగా మారిపోయింది. రాజకీయ ప్రత్యర్థుల్ని వేటాడి, వెంటాడి వేధించడమే అజెండా! నేతలే కాదు... వారి అనుచరులనూ వదలడంలేదు.
ఎన్నెన్నో ఉదాహరణలు..
అది యజమానులెవరూ లేని భూమి. అంటే... వారసులూ ఉండని భూమి. ఇలాంటి భూములను రెవెన్యూ రికార్డుల్లో ‘రావు ఖాతా’లో నమోదు చేస్తారు. ఈ భూమి చెందితే.... ప్రభుత్వానికి చెందాలి. లేదా, ఏళ్లతరబడి వాటిని సాగు చేసుకుంటున్న రైతులకు దక్కాలి. కానీ... అధికార పార్టీ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. తమ తరఫున బినామీలను తెరపైకి తెచ్చారు. రావు ఖాతాలోని భూములను తమ ఖాతాలోకి మార్పించుకున్నారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో ఈ భూ బదిలీ జరుగుతోంది. మాకవరపాలెం మండలం తూటిపాల సర్వే నంబరు 210లో 76.55 ఎకరాల భూమి రెవెన్యూ రికార్డుల్లో ఎప్పటి నుంచో ‘రావు ఖాతా’లో ఉంది. ఈ భూముల్లో 50 మంది రైతులు చాలా కాలంగా మామిడి, జీడిమామిడి తోటలు, వరి సాగు చేసుకుంటున్నారు. సరిగ్గా ఈ భూములపైనే ఇద్దరు వైసీపీ యువ ఎమ్మెల్యేల కన్ను పడింది. దానిని  సొంతం చేసుకునేందుకు పక్కాగా కథ నడిపించారు. విశాఖకు చెందిన ఒక బడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని రంగంలో దింపారు. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కయ్యారు. మొత్తం భూమిని 12 మంది బినామీల పేరిట గత నెల చివరి వారంలో ఆన్‌లైన్‌లో నమోదు చేసేశారు. ఈ భూ బదిలీ చడీచప్పుడు కాకుండా జరిగిపోయింది. ఆ 12 మందిలో ఒక్కరు కూడా స్థానికులు లేరు. ఈ మొత్తం వ్యవహారం విశాఖ నుంచే జరిగినట్లు మండల రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మొత్తం 76.55 ఎకరాలలో ఇద్దరు ఎమ్మెల్యేలు చెరో 15 ఎకరాలు పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. రైతులు అభ్యంతరం వ్యక్తం చేయకుండా వారికీ కొంత భూమి అధికారికంగా బదిలీ చేస్తామని చెప్పినట్లు సమాచారం. మిగిలిన భూమి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి చేతుల్లో ఉంటుంది. ఈ వ్యవహారమంతా విశాఖ నుంచే జరిగిందని మండల రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. భూమిని బదిలీ చేసిన 12 మంది పేరిట పట్టాదారు పాసుపుస్తకాలు కూడా జారీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. విచిత్రం ఏమింటే... ఈ భూమిలో 13 ఎకరాల విస్తీర్ణంలో రెండు సాగునీటి చెరువులు ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయడానికి 2009 నుంచి ఈ ఏడాది వరకు రూ.4.5 కోట్ల ఉపాధి హామీ నిధులు వెచ్చించారు. ఇప్పుడు ఈ చెరువులను కూడా బినామీ పేర్లతో రాసేయడం అక్రమాలకు పరాకాష్ఠ!
కూల్చివేతలు..
మాజీ ఎంపీ సబ్బం హరి.. ఆయన విశాఖ మాజీ మేయర్‌ కూడా. జీవీఎంసీకి చెందిన పార్కులో ఐదు అడుగుల స్థలం ఆక్రమించారంటూ తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆయన ఇంటికి వెళ్లి బాత్రూమ్‌ కూలగొట్టి ఫెన్సింగ్‌ వేశారు. అక్కడితో ఆగకుండా ఆయన ఇంటి స్థలం కూడా ప్రభుత్వ భూమే అంటూ నోటీసులు ఇచ్చి కూల్చే ప్రయత్నం చేశారు. ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. మాజీ ఎంపీ ఎంవీవీఎస్‌ మూర్తికి చెందిన గీతం డీమ్డ్‌ యూనివర్సిటీ (ప్రస్తుతం ఆయన మనవడు, బాలకృష్ణ రెండో అల్లుడు భరత నిర్వహిస్తున్నారు) ఆధీనంలో ఉన్న భూమిని దసరా పండుగ సమయంలో స్వాధీనం చేసుకుని... ప్రహరీగోడ, గేటుతోపాటు కొన్ని కట్టడాలను కూల్చివేశారు..
2024 వరకు లీజు ఉన్నా తొలగింపు
ఎన్నికల ముందు విశాఖ విమానాశ్రయంలో జరిగిన ‘కోడికత్తి’ ఘటన సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు! ఎన్నికలకు ముందు జగన్‌పై విశాఖ విమానాశ్రయంలోని లాంజ్‌లో అక్కడే క్యాంటీన్‌లో పని చేస్తున్న శ్రీనివాస్‌ అనే యువకుడు కోడికత్తితో దాడి చేశాడు. తాను జగన్‌కు వీరాభిమానినని, సంచలనం సృష్టించేందుకే ఈ దాడి చేశానని లేఖ రాసి పెట్టాడు. విశాఖ విమానాశ్రయంలో క్యాంటీన్‌ను టీడీపీ సానుభూతిపరుడైన హర్షవర్ధన్‌ నిర్వహిస్తుండటంతో... ఈ ఘటన వెనుక తెలుగుదేశం పాత్ర ఉందని, జగన్‌ను హత్య చేయించడానికి కుట్ర పన్నారని వైసీపీ అప్పట్లో ఆరోపించింది. ఇప్పుడు మరోసారి ఆ హర్షవర్ధన్‌ను సర్కారు ‘టార్గెట్‌’ చేసుకుందని టీడీపీ ఆరోపిస్తోంది.  విశాఖ నగరం  నడిబొడ్డున ఉన్న సిరిపురం ప్రాంతంలో వీఎంఆర్‌డీఏకి చెందిన ఖాళీ స్థలాన్ని హర్షవర్ధన్‌ 15 సంవత్సరాల కిందట లీజుకు తీసుకున్నారు. అందులో ఫ్యూజన్‌ ఫుడ్స్‌ పేరిట హోటల్‌ నడుపుతున్నారు.  2015లో లీజు గడువు పూర్తికాగా... అధికారులు దానిని మరో 9 సంవత్సరాలు పొడిగించారు. అంటే... దీని గడువు 2024 వరకు ఉంది. అయితే... వీఎంఆర్‌డీఏ అధికారులు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, నోటీసులు జారీ చేయకుండా, శనివారం అర్ధరాత్రి దాటాక రెండు గంటలకు ఫ్యూజన్‌ ఫుడ్స్‌ హోటల్‌కు వెళ్లారు. సుమారు 50 మందితో వెళ్లి... తాళాలు పగలగొట్టారు. మొత్తం సామాన్లను తామే లారీల్లోకి ఎక్కించారు. భవనాన్ని, స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ గేటుకు ఓ నోటీసు అంటించారు. ‘‘మూడేళ్లకు మించి లీజుకు ఇస్తే... ప్రభుత్వం అనుమతి అవసరం. కానీ... అది లేకుండానే తొమ్మిదేళ్లు లీజు పొడిగించారు. వేలం వేయకుండా తక్కువ మొత్తానికి తీసుకున్నారు. అందుకే ప్రభుత్వ పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు భవనాన్ని స్వాధీనం చేసుకుంటున్నాం’’ అని వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ కోటేశ్వరరావు ఆ నోటీసులో పేర్కొన్నారు. హోటల్‌లోని సామాన్లను హర్షవర్ధన్‌ ఇంటికి పంపించారు. ఆయన తీసుకోకపోవడంతో పెందుర్తి సమీపంలో ప్రభుత్వ గోదాములకు తరలించినట్టు తెలిసింది. శనివారం దీపావళి సెలవు, ఆదివారం సెలవు ఉన్నప్పుడే అధికారులు ఇలా విరుచుకుపడటం గమనార్హం.
గంటా భూమి స్వాధీనం..
మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 1997 జూన్‌లో సింహాచలం ప్రాంతంలోని అడవివరం సమీపాన విజయరాంపురంలో 4.8 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ఇది ఆయన భాగస్వామ్య కంపెనీ ప్రత్యూష అసోసియేట్స్‌ పేరిట రిజిస్టర్‌ అయ్యింది. అప్పటికి ఆయన ఇంకా రాజకీయాల్లోకి కూడా రాలేదు. అయితే, ఇదే సర్వే నంబరులో 100 ఎకరాలకు పైగా ఇనామ్‌ భూమి ఉంది. దాదాపు 90 ఏళ్లుగా ఈ భూమి చేతులు మారుతోంది. రిజిసే్ట్రషన్లు కూడా జరుగుతున్నాయి. కొందరు పట్టాలు తెచ్చుకున్నారు. మరికొందరు కోర్టుకు వెళ్లారు. ఉన్నట్టుండి ఇప్పుడు రెవెన్యూ అధికారులు దీనిపై స్పందించారు. ఇక్కడ... ప్రభుత్వానికి చెందిన 124 ఎకరాల భూమి ఉందని, అందులో 30 ఎకరాలకు పట్టాలు ఉండగా, మరో 32 ఎకరాల వివాదం కోర్టులో ఉందని పేర్కొన్నారు. మిగిలిన భూమిలో ఆక్రమణలు ఉన్నాయంటూ శనివారం తెల్లవారుజామున విజయరాంపురం తరలి వెళ్లారు. ప్రహరీలను కూల్చివేశారు. పలు స్థలాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 4.8 ఎకరాలు గంటా శ్రీనివాసరావు భాగస్వామ్య కంపెనీకి చెందినదే. మిగిలిన వారివన్నీ అరెకరం, ఇంకా తక్కువ విస్తృర్ణం ఉన్నవే. తాము ఈ భూమిని సుమారు రెండున్నర దశాబ్దాల క్రితం కొనుగోలు చేశామని, ఇది ఆక్రమణ కాదని ప్రత్యూష అసోసియేట్స్‌ కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ భూమిని గతంలో కంపెనీ బ్యాంకులకు గ్యారెంటీగా చూపించి రుణం తీసుకుంది. ఇటీవల బ్యాంకు రుణం తీర్చేసి, పట్టా కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. ఇది మునిసిపల్‌ కార్పొరేషన్‌ వద్ద పెండింగ్‌లో ఉండగానే... అధికారులు భూమిని స్వాధీనం చేసుకున్నారు. గంటాకు భీమిలిలో ఓ గెస్ట్‌హౌస్‌ ఉంది. దానికి ప్లాన్‌ అప్రూవల్‌ లేదంటూ కూల్చేందుకు ప్రయత్నించారు. ఆయన కోర్టు నుంచి ఆర్డర్‌ తెచ్చుకున్నారు. గంటా అనుచరుడైన బొడ్డేటి కాశీవిశ్వనాథం కుమారుడు భీమిలికి సమీపాన ఓ ప్రైవేటు స్థలం లీజుకు తీసుకుని పర్యాటకుల్ని ఆకర్షించే గో కార్టింగ్‌ ఏర్పాటు చేసి నిర్వహిస్తుండగా దానిని కూడా ఇటీవల కూల్చేశారు. సీఆర్‌జడ్‌ పరిధిలో ఉందంటూ విరుచుకుపడ్డారు. ఇలాంటివి బీచ్‌ రోడ్డులో వైసీపీ నాయకులకు చెందినవి అనేకం ఉన్నాయి. వాటి జోలికి పోకుండా టీడీపీ నాయకులు, ఆ పార్టీ సానుభూతిపరుల్ని లక్ష్యంగా చేసుకొని కూల్చివేతలకు పాల్పడుతున్నారు.
వీకెండ్‌ అంటేనే భయం..
శని, ఆదివారాలొస్తే చాలు! విశాఖలో అధికారులు ఎవరి ఇళ్లను కూల్చేస్తారో, ఎవరి ప్రహరీలను పడగొడతారో అనే భయం మొదలైంది! శనివారం, ఆదివారం కూడా కోర్టులు పని చేసేలా చూడాలని బీజేపీ సీనియర్‌ నేత విష్ణుకుమార్‌రాజు చేసిన వ్యాఖ్యలు అక్కడి అరాచకాలకు అద్దం పడుతున్నాయి. వాస్తవానికి వైసీపీ అధికారంలోకి రాగానే విశాఖలో ఖాళీ స్థలాలన్నిటికీ జనం ప్రహరీలు నిర్మించుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని.. అవసరమనిపిస్తే.. తమ స్థలాలకు సెక్యూరిటీ గార్డులను కాపలాగా పెట్టుకుంటున్నారని.. అయినా వైసీపీ ముఖ్య నేత ప్రోద్బలంతో కూల్చివేతలు, కబ్జాలు యథేచ్ఛగా సాగుతున్నాయని నగరవాసులు, పలు పార్టీల నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.