కుప్పంలో తనను ఓడించడం..జగన్ తాతకు కూడా సాధ్యం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తాజాగా ఆయన తన సొంత నియోజకవర్గం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుప్పం ప్రజలు ఈసారి తనకు లక్ష ఓట్ల మెజారిటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని అన్నారు. కుప్పం ప్రజలను తానెప్పుడూ ఇలా అడగలేదని చెప్పారు. ఈ సారి ఇక్కడి ప్రజలే తనకు భారీ మెజారిటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారన్నారు. “లక్ష ఓట్ల మెజారిటీ సాధిస్తారా, నమ్మకమేనా?“ అని చంద్రబాబు కుప్పం ప్రజలను అడిగారు.
ఈ సారి జరుగుతున్న ఎన్నికల్లో రాష్ట్రంలో అతిపెద్ద మెజారిటీ వచ్చే నియోజకవర్గం కుప్పం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అన్ని ఎన్నికల్లో టీడీపీని గెలిపించిన నియోజకవర్గం కుప్పం, సైకిల్ కు తప్ప వేరే పార్టీకి ఓటేయరని ధీమా వ్యక్తం చేశారు. “కుప్పంలో మీరు చరిత్ర సృష్టించాలని నిర్ణయించుకున్నారు. గతంలో 70 వేల మెజారిటీ వచ్చింది. కానీ ఈసారి టార్గెట్.. లక్ష ఓట్ల మెజారిటీ. ఇప్పటికే ఏడు సార్లు గెలిపించిన కుప్పం నియోజకవర్గానికి ఎంతో రుణపడి ఉన్నాను“ అని చంద్రబాబు అన్నారు.
గత 35 ఏళ్లలో ఏం చేశానో, అంత అభివృద్ధి రాబోయే ఐదేళ్లలో చేసి చూపిస్తానని చంద్రబాబు అన్నారు. “మీది, నాది ఈనాటి బంధం కాదు. గత మూడున్నర దశాబ్దాలుగా నన్ను ఆదరిస్తున్నారు. ఇక్కడ ప్రతి ఇల్లు నా ఇల్లు. ప్రతి గ్రామం నా గ్రామమే“ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో వైసీపీ నాయకులపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. “చాలా మంది కుప్పిగంతలు వేశారు. కుప్పంలో చంద్రబాబును కూడా ఓడిస్తామన్నారు. వారి వల్ల కాదు కదా.. సీఎం జగన్ తాత దిగివచ్చినా.. నన్ను ఓడించడం ఎవరి వల్లా కాదు“ అని చంద్రబాబు అన్నారు.
“వైనాట్ కుప్పం, వైనాట్ 175 అన్నారు. కుప్పంలో నన్ను ఓడించడం వీళ్ల వల్ల అవుతుందా? నేను అడుగుతున్నా… వై నాట్ పులివెందుల? జగన్… నీకెందుకు ఓటెయ్యాలి? బాబాయిపై గొడ్డలి వేటు వేసినందుకా? రాష్ట్రాన్ని దోచుకున్నందుకా? రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేసినందుకా?“ అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. కాగా, చంద్రబాబు కార్యక్రమానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.