తెలుగు వారి ఆత్మగౌరవం నినాదంతో విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పెద్దల మెడలు వంచి తెలుగోడి సత్తాను గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించేలా చేసిన ఘనత ఎన్టీర్ దే. ప్రాంతీయ పార్టీలు తలచుకుంటే జాతీయ పార్టీలను మట్టికరిపించగలవని నిరూపించిన పార్టీ టీడీపీ అనడంలో ఎటువంటి సందేహం లేదు. మార్చి 29, 1982న అన్నగారు స్థాపించిన ఆ పార్టీ అంచెలంచెలుగా ఎదిగి ఈ ఏడాదికి 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే టీడీపీ 40వ వార్షికోత్సవ వేడుకలను ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు యూరప్ లోనూ ఘనంగా నిర్వహించబోతున్నారు.
యూరప్ లో టీడీపీ నేత, వేణు మాధవ్ పోపూరి( యూకే ) ఆధ్వర్యంలో, టిట్టు, శివ (జర్మనీ), మురళి రాపర్ల (ఐర్లాండ్ ) వంటి ప్రముఖుల సహకారంతో ఈ వేడుకలు యూరప్ వ్యాప్తంగా అట్టహాసంగా జరగబోతున్నాయి.
ఎంతో కాలంగా యూరప్ టీడీపీకి సేవలందిస్తున్న సీనియర్ నాయకులని సన్మానం చేయడానికి ఏర్పాట్లు మరియు nritdpeurope.com ని అధికారక వెబ్సైటు గా లాంచింగ్ కి సన్నాహాలు చేస్తున్నట్లు వేణు మాధవ్ తెలిపారు.
ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. యూరప్ లోని ఎన్నారైలకు ఓ జ్జాపకంలా నిలిచిపోయేలా ఈ వేడుకలను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.
యూరప్ లోని టీడీపీ కౌన్సిల్ మెంబర్స్ ని, నందమూరి అభిమానులని, కుటుంబ సమేతంగా ఉల్లాసంగా ఈ వేడుకల్లో పాల్గొనాలని వేణు మాధవ్ పిలుపునిచ్చారు.