అనుకోని పరిస్థితుల్లో.. మరో దారి లేక బీజేపీలో చేరిన సీనియర్ నేత ఈటల రాజేందర్ కు ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరిన ఆయన.. తాను వెంట తీసుకెళ్లిన అందరితో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి ఈ రోజు (మంగళవారం) రిటర్న్ కావటం తెలిసిందే. అయితే.. అనూహ్యంగా ఆయన ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం త్రుటిలో పెద్ద ప్రమాదాన్ని తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఆయన తెలంగాణకు రావటం కాస్త ఆలస్యమవుతుందని చెబుతున్నారు.
ఇంతకూ ఈటల అండ్ కో ప్రయాణిస్తున్న విమానానికి ఏమైంది? అన్న విషయంలోకి వెళితే.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు ఈ ఉదయం ఈటల రాజేందర్ తో పాటు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్.. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ తో పాటు పలువురు నేతలు ఉన్నారు. ఈటల తనతో పాటు దాదాపు 180 మందిని వెంట తీసుకొని వెళ్లారు.
ప్రత్యేక విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో విమానంలో ఎదురైన సాంకేతిక సమస్యను గుర్తించినట్లుగా తెలుస్తోంది. సరిగ్గా విమానం గాల్లో లేచే వేళలో విమానంలో ఇష్యూను గుర్తించిన పైలెట్ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. దీంతో.. పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పినట్లుగా చెబుతున్నారు. ఈ కారణంగా ప్రయాణం కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది.