ఏపీలో జగన్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన వర్గాల్లో ఒకటి ప్రభుత్వ ఉద్యోగులు. అయితే, జగన్ అధికారంలోకి వస్తే తమకిక స్వర్ణయుగమే అని భావించారు. సీపీఎస్ రద్దు వారంలోపు జగన్ రెడ్డి చేసేస్తారని వారు ఎంతో ఆశపెట్టుకున్నారు. కానీ తనకు ఓటేసి తనను గెలిపించిన ప్రభుత్వ ఉద్యోగులను జగన్ తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వారికి రావల్సిన జీతాలు కూడా రాని పరిస్థితి.
కరోనా వల్ల జీతాలు కట్ చేస్తే కోర్టుకు వెళ్లి వారు తమ జీతాలు సాధించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే వారి డీఏ గురించి అయితే గడువులు దాటిపోయినా మాట్లాడని జగన్… ఇపుడు డీఏ సంక్రాంతి నుంచి ఇస్తామని ప్రకటించి వారిని ఉసూరుమనిపించారు. సంక్రాంతికి వచ్చే డబ్బులను దసరా కానుక అంటూ కీర్తించడం ఉద్యోగులకు కోపం తెప్పిస్తోంది. దసరాకు జీఓ ఇస్తే దసరా కానుక అవుతుంది గాని ఒక ప్రకటన ఇస్తే అది దసరా కానుక ఎలా అవుతుంది అని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు.
ఎన్నికలు రానివ్వు నీ అంతు చూస్తాం అని మనసులో అనుకుంటున్న ఉద్యోగులు ప్రస్తుతానికి మౌనంగా రోదిస్తున్నారు. ఇక డీఏ ఇచ్చిన విధానం ఇంకా ఘోరం. జులై 2018, జనవరి 2019లో రావల్సిన డీఏ మాత్రమే చంద్రబాబు హయాంలో పెండింగ్ ఉండగా… వాటితో పాటు జగన్ వచ్చాక అందాల్సిన డీఏను కూడా జగన్ ఇంతకాలం ఆపేశారు. ఇన్నాళ్లకు కేవలం 2 శాతం చొప్పున 2021 నుంచి మొదలుపెడతారట. 2018 నాటిది 2021లో, 2019 నాటిది 2022లో, 2020 నాటిది 2023లో ఇస్తారట. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు జగన్ పనితీరు సమర్థతపై పూర్తి అసంతృప్తితో రగిలిపోతున్నారు.