ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. జగన్ అనాలోచిత నిర్ణయాలపై ప్రభుత్వ ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. జగన్ పాలనలో తాము కూడా అమ్మో ఒకటో తారీకు అనే రీతిలో జీతాల కోసం ప్రతినెలా 5 నుంచి 20వ తారీకు వరకు ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చిందని ఉద్యోగులు వాపోతున్నారు. ఏపీ సర్కార్ జీతాలు కూడా ఇవ్వలేకపోతోందని జాతీయ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
రెండ్రోజులు ఆలస్యమైనా జీతాలు ఇస్తున్నాం కదా అంటూ బుగ్గన చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగులంతా గరంగరంగా ఉన్నారు. పైగా ఉద్యోగులతో తాను మాట్లాడానని, జీతాలు లేటుగా రావడం వల్ల ఇబ్బందేమీ లేదని వారు చెప్పారని సెలవిచ్చారు. కానీ, వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. జగన్ సర్కార్ తీరుతో విసిగి వేసారిన ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి ఉద్యమబాటపట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ సీఎస్ సమీర్ శర్మకు ఉద్యమ కార్యాచణ నోటీసు ఇచ్చాయి.
జగన్ సర్కార్ పై ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. డిసెంబరు 7నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలపనున్నారు. అంతేకాదు, ర్యాలీలు, ధర్నాలు చేపట్టి పోరుబాట పట్టనున్నాయి. విశాఖ, తిరుపతి, ఏలూరు, ఒంగోలు నగరాల్లో డివిజన్ స్థాయి సదస్సులు నిర్వహించి తమ గోడు వెళ్లబోసుకోనున్నాయి.
జీతాలు తీసుకోవడం తమ హక్కు అని, భిక్ష కాదని అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. సచివాలయం ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డిది అనుభవరాహిత్యమని చెప్పారు. 94 ఉద్యోగ సంఘాలు ఆందోళనలకు రెడీ అని, ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉమ్మడి వేదికగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయని చెప్పారు. జగన్ తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేవరకు ఉద్యమం ఆగదని వెల్లడించారు.11వ పీఆర్సీ అమలు, డీఏ బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ గ్రామ సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగుల లోన్స్, అడ్వాన్సుల చెల్లింపు తదితర డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఉద్యమం చేపట్టబోతున్నామన్నారు.