సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోన్న సంగతి తెలిసిందే. సర్కారీ నౌకరీ ఉండి కూడా అమ్మో ఒకటో తారీకు అనే రేంజ్ లో తమను భయపెట్టిన సీఎం జగన్ ఒక్కడే నని ఉద్యోగులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇక, సీపీఎస్ రద్దు విషయంలో జగన్ మాట తప్పడాన్ని, మడమ తిప్పడాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిలదీస్తున్నారు.
ఈ క్రమంలోనే సెప్టెంబరు 1న వాయిదాపడిన మిలియన్ మార్చ్ ను సెప్టెంబరు 10వ తేదీన నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో, ఉపాధ్యాయులను అడ్డుకోవడానికి ప్రభుత్వ పెద్దలు, మంత్రులు నానా తిప్పలు పడుతున్నారు. ఇలా, ప్రభుత్వాన్ని గట్టిగా తాకిన ఉపాధ్యాయుల సెగను చల్లార్చే లోపే జగన్ కు మరో షాక్ తగిలింది.
తమ డిమాండ్లు నెరవేర్చకుంటే సమ్మెబాటపడతామని ఏపీలోని గ్రామ పంచాయతీ శాఖ ఉద్యోగులు…జగన్ కు అల్టిమేటం ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రకారం ప్రభుత్వానికి రాష్ట్ర గ్రామ పంచాయతీ శాఖ ఉద్యోగుల సంఘం సమ్మె నోటీసు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నోటీసులో 9 ప్రధాన సమస్యలను ఉద్యోగులు ప్రస్తావించారు. అంతేకాదు, తమ డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని, లేకుంటే సమ్మె తప్పదని వార్నింగ్ ఇచ్చారు.
తమ డిమాండ్లు పరిష్కారం కాకుంటే అక్టోబర్ 2 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరికలు జారీ చేశారు. ఉద్యోగులకు ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ ఉద్యోగులు, గ్రీన్ అంబాసిడర్లకు కనీస వేతనం ఇవ్వాలని వారు కోరారు. దీంతోపాటు, ఉద్యోగులకు కనీస వేతనంగా రూ.20 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
నెలకు రూ.6 వేల చొప్పున ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని కూడా కోరారు. ఇక, పంచాయతీ కార్మికులను అర్ధాంతరంగా విధులన నుంచి తొలగించడాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వారికి, ఉద్యోగ భద్రతను కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను అందించాలని ఉద్యోగుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. మరి, ఈ డిమాండ్లపై జగన్ అండ్ కో స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
Comments 1