ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కేఆర్ సూర్యనారాయణను సర్కారు సస్పెండ్ చేసింది. అయితే.. ఆయనపై వేరే కారణం చూపడం గమనార్హం. వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఆయన.. కొందరితో కలిసి జీఎస్టీ నిధులకు గండికొట్టారని, వ్యాపారులను బెదిరించి లంచాలు తీసుకున్నారని కేసు నమోదైంది. దీనిని విచారించిన పోలీసులు కొన్నాళ్లకిందటే కేసు నమోదు చేశారు. ఈ విచారణ కొనసాగుతున్న క్రమంలోనే ఉద్యోగ సంఘం నేత కేఆర్ అదృశ్యమయ్యారు.
తనను పోలీసులు అరెస్టు చేయడం జరిగితే.. ఎంపీ రఘురామకృష్ణ రాజు కు పట్టిన గతే పడుతుందని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు కొన్ని రోజుల కిందట వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన ముందస్తు బెయిల్‌కు కూడా పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే.. ఈ పిటిషన్‌ను స్థానిక కోర్టు తోసిపుచ్చింది. తాజాగా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పరిణామాలు జరుగుతుండగానే.. ప్రభుత్వం సస్పెన్షన్ కొరడా ఝళిపించింది. సూర్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ప్రొసీడింగ్ జారీ చేసింది.
కేఆర్‌పై క్రమశిక్షణా చర్యలు పూర్తిగా తీసుకునే వరకూ సస్పెన్షన్ ఉత్తర్వులు కొనసాగుతాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్ ప్రొసీడింగ్స్‌ను విడుదల చేశారు. ఈ ఏడాది మే 30న విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన అవినీతి కేసులో ఏ-5గా కేఆర్‌ను చేర్చారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఏపీ కమర్షియల్ ట్యాక్స్ అసోషియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సూర్యానారాయణతో కలిసి ఇతర నిందితులు భారీ మొత్తంలో వ్యాపారులు నుంచి తనిఖీల పేరుతో డబ్బులు వసూలు చేశారని తెలిపింది.
ర్యనారాయణ ఉద్యోగంలో కొనసాగితే విచారణ సజావుగా సాగదని ప్రభుత్వనికి కూడా హాని కలిగే అవకాశం ఉందంటూ ప్రొసీడింగ్స్‌లో పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే విచారణకు సహకరించకపోవడంతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు హైకోర్టులో కేఆర్ దాఖలు చేసిన పిటిషన్ కూడా విచారణకు వచ్చింది. అయితే.. ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండానే ఈ కేసును వారం రోజులపాటు కోర్టు వాయిదా వేసింది. దీంతో కేఆర్‌ను అరెస్టుచేసేందుకు పోలీసులు జల్లెడ పడుతున్నట్టు తెలిసింది.