ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికళ వేళ టిక్కెట్ల ఎంపికలో పార్టీ అధినేత చంద్రబాబు రకరకాల ప్రణాళికలు, స్కెచ్‌లతో ముందుకు వెళుతున్నారు. ఈ సారి పార్టీ ఎంపీ సీట్లలో చాలా పగడ్బందీ వ్యూహాలతో ముందుకు వెళుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి బీసీ ప్రయోగం చేయని సీట్లలో కూడా ఈ సారి బీసీ వ్యూహంతో టీడీపీ ముందుకు వెళుతోంది. కోస్తాలో కీలకమైన ఏలూరు లోక్‌సభ సీటును టీడీపీ ప్రతిసారి కమ్మ సామాజిక వర్గానికే చంద్రబాబు కేటాయిస్తున్నారు. అలాంటి చోట ఈ సారి బీసీ ప్రయోగంతో వైసీపీకి చెక్ పెట్టేలా ప్లానింగ్ చేస్తోంది.
వైసీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన కోటగిరి శ్రీథర్ ( వెలమ సామాజిక వర్గం) ఈ సారి పోటీ చేయనని జగన్‌కే చెప్పేశారు. ఈ క్రమంలోనే జగన్ ఇక్కడ నుంచి బీసీ క్యాండెట్‌ను రంగంలోకి దించాలని డిసైడ్ అయ్యారు. వైసీపీ తరపున యాదవ కోటాలో మంత్రిగా ఉన్న తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పేరు ప్రథమంగా వినిపిస్తోంది. యాదవ వర్గం నుంచే ఏలూరుకు చెందిన నెరుసు వెంకటేశ్వరరావుతో పాటు మాజీ మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్ పేరు కూడా అధిష్టానం దగ్గర పరిశీలనకు వచ్చింది.
అయితే నెల్లూరు సిటీలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోన్న అనిల్‌ను ప్రకాశం జిల్లాలోని కనిగిరికి షిఫ్ట్ చేస్తున్నారు. అక్కడ యాదవ వర్గం నుంచే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్‌కు ఈ సారి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో మొండిచేయి తప్పట్లేదు. ఇక ఏలూరు నుంచే బీసీ – గౌడ కోటాలో మరో మంత్రిగా ఉన్న జోగి రమేష్ పేరు కూడా చర్చల్లో ఉన్నా వైసీపీ ఈ సీటు యాదవులకే ఇవ్వాలని దాదాపు నిర్ణయం తీసేసుకుంది.
వైసీపీ బీసీ ఈక్వేషన్‌కు టీడీపీ కూడా దిమ్మతిరిగే ఈక్వేషన్‌తో చెక్ పెట్టబోతోంది. కారుమూరికి ఇక్కడ సీటు ఇచ్చినా నాన్ లోకల్ అవుతాడు. టీడీపీ నుంచి చింతలపూడి నియోజకవర్గం కామవరపుకోట మండలం కంఠమనేని వారిగూడెంకు చెందిన ప్రముఖ యువ పారిశ్రామిక వేత్త యాదవ సామాజిక వర్గం నేత గోరుముచ్చు గోపాల్ యాదవ్ పేరు గత ఆరేడు నెలలుగా నానుతోంది. ఏలూరు లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీసీల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. అందులోనూ యాదవ వర్గం ఓట్లు ప్రతి నియోజకవర్గానికి సగటున 25 వేల రేంజ్లో ఉన్నాయి.
వీరంతా టీడీపీకి ఎప్పటి నుంచో సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో మాత్రమే కొంత వైసీపీకి టర్న్ అయ్యింది. ఈ సారి గోరుముచ్చుకు సీటు ఇస్తే ఆ ప్రభావం ఏలూరు లోక్‌సభ సెగ్మెంట్ అంతా పడి ఏడు ఎమ్మెల్యే సీట్లలోనూ టీడీపీకి ప్లస్ కావడంతో పాటు పార్లమెంటు సీటును సులువుగా గెలవవచ్చనే అంచనాలో అధిష్టానం ఉంది. ఈ క్రమంలోనే చంద్రబాబు, ఇటు యువనేత లోకేష్ ఇద్దరూ గోరుముచ్చుకు సీటు ఇచ్చే విషయంలో ఓకే చెప్పేసినట్టు పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. లోకేష్ ఇప్పటికే తన ప్రచారంలో ఈ సారి యాదవులకు ఓ ఎంపీ టిక్కెట్ ఇస్తున్నానని బహిరంగంగానే చెప్పారు. ఆయన కూడా గోరుముచ్చును దృష్టిలో ఉంచుకునే చెప్పినట్టు పార్టీ వర్గాలు చెపుతున్నాయి.
ఇటు బీసీల్లో పట్టు ఉండడం, యాదవ వర్గం నేత కావడంతో పాటు అటు ఆర్థిక బలంలోనూ మిన్నగా ఉండడం, యూత్‌లో మంచి క్రేజ్ ఉండడం ఇవన్నీ గోపాల్యాదవ్కు సానుకూలాంశాలు అవుతున్నాయి. ఏదేమైనా పార్టీ ఆవిర్భవించాక టీడీపీ ఫస్ట్ టైం ఏలూరు పార్లమెంటు సీటు విషయంలో బీసీ ప్రయోగంతో ముందుకు వెళుతోంది. బాబు బీసీ ఈక్వేషన్ ముందుగా గ్రహించే జగన్ దిగివచ్చి బీసీ ఈక్వేషన్‌తో వెళ్లే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.