ఎన్నికలకు ముందు.. వైసీపీ అధినేత, సీఎం జగన్ కు ఓ కీలక నియోజకవర్గం, టీడీపీలో ఓ నేత బాగా టెన్షన్ పెట్టేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పరుచూరు ఎమ్మెల్యే, టీడీపీ పాపులర్ లీడర్ ఏలూరి సాంబశివరావు క్రేజ్, ఆయనకు ప్రజల్లో ఉన్న ఫాలోయింగ్ వైసీపీని కలవరపెడుతున్నాయి. వైనాట్-175 అని నినాదాన్ని అంది పుచ్చుకున్న వైసీపీకి కొరుకుడు పడని కొన్ని నియోజకవర్గాల్లో.. పరుచూరు కూడా ఒకటి. ఇక్కడ నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలు అందుకున్న ఏలూరి ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారు.
వచ్చే ఎన్నికల్లోనూ విజయం దక్కించుకునే దిశగా ఏలూరి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడడమే కాదు.. ఎన్నికల అక్రమాలపైనా ఆయన పోరాటం చేస్తున్నారు. ఇది వైసీపీ అధిష్టానానికి, ఆ పార్టీ పెద్దలకు కంట్లో నలుసుగా మారింది. పరుచూరు నియోజకవర్గంలో ఎలాగైనా ఏలూరిని ఈ సారి ఓడించాలని జగన్ విశ్వప్రయత్నాలు చేశారు. గత నాలుగున్నరేళ్లలో ముగ్గురు ఇన్‌చార్జ్‌లను మార్చారు. ఇప్పుడున్న ఇన్చార్జ్కు కూడా క్లైమాక్స్ లో అయినా సీటు వస్తుందా ? అంటే డౌటే.
ఇన్‌చార్జ్‌లను మార్చడంతో పాటు ఇక్కడ లెక్కలేనన్ని దొంగ ఓట్లను ఇక్కడ చేర్పించారని.. పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. వీటిపై రాష్ట్ర ఎన్నికల అధికారులు కూడా దృష్టిపెట్టారు. ఇలాంటి నకిలీ ఓట్లపైనే ఏలూరి సాంబశివరావు ఉద్యమించారు. ఫాం-7 ద్వారా.. నకిలీ ఓట్లు తొలగించేలా ఆయన చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. రాష్ట్ర అధికారులు ముందు పట్టించుకోకపోవడంతో ఆయన నేరుగా లీగల్‌గా వెళ్లి నకిలీ ఓట్లు తొలగించేలా చేశారు. ఇది వైసీపీకి రాజకీయంగా దడపుట్టింది. 2014, 2019లో వైసీపీ ఇక్కడ ఘోరంగా ఓడిపోయింది. 2024 ఎన్నికల్లోనూ పరుచూరులో ఏలూరి చేతిలో వైసీపీకి చావు దెబ్బ తప్పదనే రకరకాలుగా ఆయన్ను టార్గెట్ చేస్తున్నారు.
అధిష్టానం ఎత్తులకు ఏలూరి వేస్తున్న అడ్డుకట్టలు, వ్యూహాలు వైసీపీకి మతిపోయేలా చేస్తున్నాయి.
దీంతో రాజకీయంగా ఆయనను మరింత ఇబ్బంది పెట్టేలా.. వైసీపీ వ్యాపారాలపై దృష్టి పెట్టింది. గ్రానైట్ కంపెనీలపై దాడులు చేయించి.. ఆర్థికంగా ఏలూరిని కట్టడి చేయాలని కుట్రలు పన్నింది. ఈ క్రమంలోనే గత వారం మైనింగ్ అధికారులు ఏలూరి కంపెనీలపై దాడులు చేయించారు. ఈ క్రమంలో అసలు ఎవరూ అడ్డుకోకపోయినా.. అడ్డుకున్నారంటూ.. అధికారులు పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో ఏలూరిని ఎన్నికలకు ముందు ఇబ్బంది పెట్టాలన్న కుట్రలో భాగంగా.. ఆయనను అరెస్టు చేసేందుకు సైతం రంగం రెడీ చేసుకున్నారు.
అయితే.. వైసీపీ కుట్రలను ఆది నుంచి తనదైన శైలిలో తిప్పికొడుతున్న ఏలూరి.. దీనిని కూడా తిప్పికొడుతున్నారు. ఆయన ఇటు నియోజకవర్గంలో ప్రజాక్షేత్రంలో పోరాటం చేయడంతో పాటు అటు న్యాయపరంగా కూడా ఈ కుట్రలను ఎదుర్కొంటున్నారు. ఏదేమైనా పరుచూరు – ఏలూరి ఈ రెండు పేర్లు జగన్‌ను మామూలుగా టెన్షన్ పెట్టడం లేదన్నది ఏపీ రాజకీయాల్లోనే పెద్ద హాట్ టాపిక్‌గా మారాయి.