ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఏది చేసినా సంచలనమే. మస్క్ కు ఉన్న ఇమేజ్ అటువంటిది. అందుకే, మస్క్ ట్విటర్ ను కొంటున్నాడనగానే అంతా షాకయ్యారు. అయితే, ఎంత హడావిడిగా ట్విటర్ ను సొంతం చేసుకోవాలని మస్క్ ప్రయత్నించాడో…అంతకంటే వేగంగా ట్విటర్ డీల్ నుంచి మస్క్ తప్పుకోవడం సంచలనం రేపింది. ఆ సంస్థతో చేసుకున్న ఒప్పందంలో చెప్పిన దానికి భిన్నంగా వాస్తవ పరిస్థితులున్నాయంటూ మస్క్ ఆరోపించాడు.
ట్విటర్ లో నకిలీ అకౌంట్ల 5 శాతం కంటే తక్కువ ఉందని ట్విట్టర్ అంటుంటే..ఆ శాతం ఇంకా ఎక్కువని మస్క్ వాదిస్తున్నాడు. అందుకే, ట్విట్టర్ డీల్ నుంచి తప్పుకుంటున్నట్లు కొద్ది రోజుల క్రితం మస్క్ కుండబద్దలు కొట్టేశాడు. దీంతో, మస్క్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటారని, దాదాపు 8వేల కోట్లు. మస్క్ పెనాల్టీ చెల్లించాల్సి వస్తుందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా ట్విటర్ తో విభేదాలు సమసిపోవడంతో…తాజాగా ట్విటర్ మస్క్ సొంతమైంది.
ఈ క్రమంలోనే ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న తర్వాత మస్క్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. “పక్షికి విముక్తి లభించింది” అంటూ మస్క్ చేసిన సెటైరికల్ ట్వీట్ వైరల్ గా మారింది. ట్విట్టర్ లోగోలో నీలి రంగు పక్షి ఉండడంతో దానికి విముక్తి లభించిందని, తన చేతుల్లో ట్విటర్ మరింత స్వేచ్ఛగా పనిచేస్తుందని అర్థం వచ్చేలా మస్క్ ట్వీట్ చేయడం గమనార్హం. ఇక, తనను తప్పుదారి పట్టించారన్న కారణంతో ట్విటర్ లోని టాప్ ఎగ్జిక్యూటివ్‌లను మస్క్ తొలగించినట్లు తెలుస్తోంది.