ప్రతి విషయాన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్తాం. ప్రతి అంశాన్నీ.. పార్టీకి వినియోగించుకుంటాం. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే నిరంతరం ప్రయత్నాలు సాగిస్తాం.. పార్టీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. నేను నిరంతరం ప్రభుత్వంపై కన్నేసి ఉంచుతాను. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతాను
– ఇదీ.. కొన్నాళ్ల కిందట ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన సోము వీర్రాజు చేసిన గంభీరమైన ప్రకటన. దీంతో అందరూ ఇక, బీజేపీలో మార్పు ఖాయమని.. పైగా ఆర్ ఎస్ ఎస్ భావజాలం ఉన్న నాయకుడు .. కాబట్టి.. ఆయన పట్టు వీడేది లేదని.. జగన్ సర్కారుకు పుట్టి మునగడం ఖాయమని.. పెద్ద వ్యూహంతోనే బీజేపీ పెద్దలుసోముకు ఏపీ పగ్గాలు అప్పగించారని పుంఖాను పుంఖాలుగా విశ్లేషణలు వచ్చేశాయి.
అయితే, ఆ దూకుడు, ఆ పస.. పట్టుమని రెండు నెలలు కూడా తిరగకుండానే సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు చూద్దామన్నా.. సోము వీర్రాజు కానీ, ఆయన అనుచరులు కానీ… ఎక్కడా కనిపించడం లేదు. ఆయన ఏపీ పార్టీ పగ్గాలు చేపట్టిన కొత్తలో.. దేవాలయాలపై దాడులు జరిగిన ఘటనలను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. అంతర్వేది రథం దగ్ధం ఘటన కావొచ్చు.. విజయవాడ దుర్గమ్మకు చెందిన రథం వెండి సింహాలు మాయం కావొచ్చు.. పలుచోట్ల.. చిన్నపాటి దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం కావొచ్చు.. శ్రీకాళహస్తిలో రాత్రికిరాత్రివెలిసిన కొత్త విగ్రహాలు కావొచ్చు.. అనేక సంఘనలుచోటు చేసుకున్నాయి. వాటిపై సోము విజృంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించారు. అంతర్వేదిపై పెద్ద ర్యాలీనే చేశారు.
ఇక, ఈ క్రమంలోనే ప్రతిపక్షం చంద్రబాబుపైనా ఆయన కామెంట్లు కుమ్మరించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత అత్యంత కీలకమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. తిరుమల వేంకటేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన వేల కోట్ల నిధులను జగన్ సర్కారు అప్పనంగా ఖజానాకు తరలించుకునే ప్రయత్నం చేసిందనే విమర్శలు వచ్చాయి. దీనికి జగన్ బాబాయి.. టీటీడీ చైర్మన్గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి కీలక పాత్ర పోషించారనే వ్యాఖ్యలు వినిపించాయి. అయితే.. వీటి విషయంలో సోము కానీ.. బీజేపీ నేతలు కానీ స్పందించలేదు. మరో కీలక విషయం.. ఏపీ సీఎం జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం. అందులోనూ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలు చేయడం.
ఈ లేఖ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. జగన్ బరితెగించారని.. పోయి పోయి న్యాయవ్యవస్థతోనే పెట్టుకున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దేశవ్యాప్తంగా లాయర్ల సంఘాలు నిరశించాయి. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. జగన్ ఒంటరిగా ఇంత పెద్ద లేఖ రాసే సాహసం చేయబోరని.. దీని వెనుక ఖచ్చితంగా బీజేపీ పెద్దలు ఉండే ఉంటారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం ఇప్పటికీ తేలలేదు. మరి ఈ సమయంలోనూ సోము వీర్రాజు నోరు విప్పలేదు. కేంద్రంలోని బీజేపీ పెద్దల పై ఇంత పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా.. ఆయన మౌనంగానే ఉన్నారు. దీనిని పరిశీలిస్తే.. బీజేపీకి ఏమైనా తేలు కుట్టిందా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి సోము.. ఎప్పటికి స్పందిస్తారో చూడాలి.