ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్, ఆయన సన్నిహితుల నివాసాల్లో జరిపిన సోదాల్లో 2.82 కోట్ల రూపాయల నగదు, 1.80 కిలోల బరువున్న 133 బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. అయితే.. ఈడీ దాడులను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. ప్రధాని మోడీ తమపై కక్ష కట్టారని.. ఆయన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌తో పాటు ఆయన సన్నిహితుల నివాసాల్లో మంగళవారం ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. సత్యేంద్ర జైన్ ఇంట్లో 2.82 కోట్ల రూపాయల నగదు, 1.80 కిలోల బరువున్న 133 బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. విచారణ కొనసాగుతోందని ఈడీ వివరించింది. గత నెల 30న మనీలాండరింగ్ కేసులో.. సత్యేంద్రను ఈడీ అరెస్టు చేసింది. ఆయన జూన్ 9 వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు. ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం సోమవారం ఢిల్లీలోని ఆయన ఇంట్లో అధికారులు సోదాలు చేశారు.
ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఇంట్లో జరిగిన ఈడీ దాడులను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. ఆయనపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని చెప్పారు. ప్రధాని మోడీతో దర్యాప్తు సంస్థలు ఉండొచ్చని.. కానీ తమతో దైవం ఉందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇదంతా ఉద్దేశ పూర్వకంగానే జరుగుతోందని.. తమ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు మోడీ కంకణం కట్టుకున్నారని.. ఇలాంటి రాజకీయ కుయుక్తులు తమ వద్ద సాగవని అన్నారు. ప్రజలే తేలుస్తారని వ్యాఖ్యానించారు.