వైసీపీ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేస్తున్న వీడియో ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలని మాచర్ల టిడిపి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డితో పాటు టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేసిన ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. పీఆర్కేను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఎన్నికల సంఘం ఆదేశించింది. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
ఇక, ఈ ఘటనపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పెట్టిన ట్వీట్ కూడా ఇందులో కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తావించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో స్థానిక పోలీసులతో కలిసి ఏపీ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కంది వద్ద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. ఫోను కారులోనే వదిలేసి డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లుగా తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై మాజీ ఐఏఎస్, ఎలక్షన్ వాచ్ కన్వీనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. రామకృష్ణారెడ్డి పై ఎన్నికల సంఘానికి నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో మరే రాజకీయ నాయకుడు ఇటువంటి పనులకు సాహసించకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని రమేష్ కోరారు.
కాగా, ఓ మహిళను పిన్నెల్లి బెదిరిస్తున్న వీడియో వైరల్ గా మారింది. ఈవీఎం పగలగొట్టిన తర్వాత బయటకు వచ్చిన పిన్నెల్లిని ఇలా చేయడం సరికాదని ఓ మహిళ ప్రశ్నించారు. దీంతో ఆవిడకు వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ పిన్నెల్లి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆగ్రహంతో ఊగిపోయిన పిన్నెల్లి ఆమెను దుర్భాషలాడారు.