కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమలనాధ్ కు ఎన్నికల కమీషన్ ఊహించని షాక్ ఇచ్చింది. మధ్య ప్రదేశ్ లో జరుగుతున్న ఉపఎన్నికల్లో స్టార్ క్యాంపైనర్ హోదాను తొలగిస్తున్నట్లు కమీషన్ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 28 మంది ఎంఎల్ఏలు పార్టీ పిరాయించి బిజేపీలో చేరారు. ఆ కారణంగా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 3వ తేదీన జరిగే ఉపఎన్నికలో కమలనాధ్ హస్తం పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరిస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా పదే పదే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. ఈ విషయంలో ఇప్పటికే ఎలక్షన్ కమీషన్ ఈ మాజీ సిఎంను హెచ్చరించింది. అయినా ఈయన తీరు మారకపోవటంతో చివరకు స్టార్ క్యాంపెయినర్ హోదాను రద్దు చేసినట్లు ప్రకటించింది. గ్వాలియర్ లోని డాబ్రా నియోజకవర్గంలో జరుగుతున్న ఉపఎన్నికలో బిజేప మహిళా అభ్యర్ధి ఇమర్తీదేవిని ఉద్దేశించి ఐటమ్ అని చేసిన కామెంటుపై ఎన్నికల కమీషన్ చాలా సీరియస్ అయ్యింది.
మొత్తం మీద పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ కమలనాధ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో బాగా వేడిక్కించేస్తున్నాయి. ఈయన స్టార్ క్యాంపెయినరా కాదా అన్న విషయాన్ని పక్కనపెట్టేస్తే ఎక్కడో కూర్చుని మీడియా సమావేశంలో ఆరోపణలు చేస్తే ఎలక్షన్ కమీషన్ ఏమి చేయగలదు ? వివిధ సందర్భాల్లో మాజీ సీఎం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కాకుండా బిఎస్పీ అధినేత్రి మాయావతి కూడా మండిపోయారు. ఇప్పటివరకు కమలనాధ్ ప్రచారానికి అయిన ఖర్చంతా కాంగ్రెస్ అభ్యర్ధుల ఎన్నికల వ్యయం ఖాతాలోనే పడుతుందని స్పష్టంగా చెప్పేసింది కమీషన్.
మొత్తానికి వయస్సు అయిపోయినా కమలనాధ్ మాత్రం బాగా ఉత్సాహంగానే ప్రచారం చేస్తున్నారు. కాకపోతే మంచి చెడ్డలు మరచిపోయి ఆవేశంలో నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. కమలనాధ్ తరచూ మహిళలపై నోటికొచ్చినట్లు చేస్తున్న వ్యాఖ్యల వల్ల పార్టీ అభ్యర్ధులకు మిగిలిన నియోజకవర్గాల్లో సమస్యలు ఎదురవుతున్నాయి. మరి దీని ప్రభావం కాంగ్రెస్ అభ్యర్ధుల గెలుపుపై ప్రభావం చూపకుండానే ఉంటుందా ?