జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో విమర్శ లు వచ్చాయి. కొందరు మహిళలు, పురుషులు కూడా లైవ్‌లో విమర్శలు గుప్పించారు. దీనికి కారణం.. బుడమేరు వరద. విజయవాడ శివారు ప్రాంతం మునిగిపోతే.. కనీసం తమను పట్టించుకునేందుకు పవన్ రాలేదన్నది వారి ఆవేదన. ఇక్కడ చిత్రం ఏంటంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చారు.. మంత్రులు వచ్చారు… అధికారులు వెన్నంటే ఉన్నారు.. అయినా.. రాని వారిపైనే జనం కన్ను పడిందన్నమాట.
అందుకే.. పవన్‌పై ఎడతెగని చర్చలు.. విమర్శలు రెండు జరిగాయి. వైసీపీ అనుకూల మీడియాలో అయి తే.. గంటల తరబడి చర్చించారు. అనుకూల వ్యక్తులు రీల్స్ చేసి.. పోస్టు చేశారు. చంద్రబాబు జైల్లో ఉంటే పొరుగు రాష్ట్రం నుంచి పరిగెట్టుకుని వచ్చిన పవన్.. ప్రజలు కష్టాల్లో ఉంటే మాత్రం రాలేదంటూ.. నిప్పులు చెరిగిన వారు.. ఆగ్రహాల కట్టలు తెంచేసుకున్న వారు కూడా ఉన్నారు. మొత్తానికి బుడమేరు వరద కంటే.. పవన్‌పై వచ్చిన విమర్శల వరదతో జనసేన తడిసిపోయింది.
దీంతో తొలుత.. తాను రంగంలోకి దిగితే సెక్యూరిటీ సమస్యలు వస్తాయని పవన్ వ్యాఖ్యానించారు. ఇది మరింత ఇబ్బందిగా మారింది. దీంతో మూడో రోజు.. పవన్ మీడియా ముందుకువచ్చి.. తనకు ఒంట్లో బాగోలేదన్నారు. వైరల్ పీవర్ అన్నారు. దీంతో తిట్టిపోసిన నోళ్లు శాంతించాయి. ఎన్ననుకుని ఏం లాభం? అనుకున్నారో.. ఏమో వ్యతిరేక మీడియాలోనూ చర్చలు మానేశారు. కాని.. ఇంతలోనే పవన్ సోమవారం.. కాకినాడ జిల్లాలో ప్రత్యక్షమయ్యారు.
ఏలేరు రిజర్వాయర్‌కు వస్తున్న వరద నీటితో పిఠాపురం నియోజకవర్గానికి పెను ముప్పు పొంచి ఉందన్న కథనాల నేపథ్యంలో ఆయన అనూహ్యంగా స్పందించారు. ఆ వెంటనే హైదరబాద్ నుంచే కలెక్టర్‌ను అలెర్ట్ చేశారు. అధికారులను అప్రమత్తం చేశారు. ఇక, సోమవారం మధ్యాహ్నానికి స్వయంగా ఆయన రానే వచ్చారు. బురదలో దిగారు. సుద్దగడ్డ వద్ద ప్రజలను పలకరించారు. వరద నీటిలో ఉన్న వారిని ఓదార్చారు. జగన్‌పై నాలుగు విమర్శలు చేశారు. దీంతో అప్పటి వరకు పవన్ రాలేదు.. రాలేదు.. అన్న వారి బారి నుంచి బయట పడి.. హమ్మయ్య.. పవన్ పరామర్శించారు.. అన్న ఉరటనిచ్చారు. దీంతో పవన్‌కు మళ్లీ మార్కులు పడిపోయాయి. అదీ సంగతి!!