వైసీపీ ఎమ్మెల్సీ, ఫైర్ బ్రాండ్ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో చెలరేగిన వివాదం.. ఇప్పడు ఆస్తుల పంపకం దగ్గర ఆగింది. భార్యా బిడ్డలను వదిలేసి.. ఆయన మాధురి అనే మహిళ(ఫ్రెండ్)తో కలిసి ఉంటున్నారని.. దువ్వాడ సతీమణి వాణి, ఆయన ఇద్దరు పిల్లలు ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై మాధురి కూడా తెరమీదికి వచ్చి.. వివరణ ఇచ్చారు. తనకు భర్త పిల్లలు ఉన్నారని, తాము డైవర్స్ తీసుకోలేదని చెప్పారు. అయితే, దువ్వాడతోనే తాను కలిసి ఉంటానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వివాదం తీవ్రమైంది. ఆత్మహత్యకు కూడా మాధురి ప్రయత్నించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన వాణి సోదరి, దువ్వాడ సోదరుడు.. రాజీ ప్రయత్నాలకు దిగారు. వివాదం ఎక్కడ మొదలైందో తెలుసుకుని.. ఆదిశగా నరుక్కొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. ఈ క్రమంలో ఆస్తుల పంపకం వ్యవహారం కీలకంగా మారింది. ప్రస్తుతం కొత్తగా నిర్మించిన ఇంటి వ్యవహారంలో తమకు పంపకాలు చేయాలంటూ.. భార్య వాణి పట్టుబడుతున్నారు. కానీ, దువ్వాడ మాత్రం దానికి ససేమిరా అంటున్నారు. ఇక, దువ్వాడ ఆస్తిలో తనకు వాటా ఉందని ఇప్పటికే మాధురి మీడియా ముందే చెప్పుకొచ్చారు.
ఐదు డిమాండ్లలో నాలుగు ఓకే!
దువ్వాడ సతీమణి వాణి.. ఈ పంచాయితీలో భాగంగా ఐదు డిమాండ్లను తెరమీదికి తెచ్చారు. దీనిలో నాలుగు డిమాండ్లకు శ్రీనివాస్ ఒప్పుకొన్నారు.కానీ, కొత్త ఇంటి వ్యవహారంలో మాత్రం ఆయన ఒప్పుకోవడం లేదు. ప్రస్తుతం టెక్కలిలో శ్రీనివాస్ ఉంటున్న ఇంటిని ఆయన తర్వాత.. తమకే చెందాలన్న డిమాండ్‌ను వాణి వినిపిస్తున్నారు. ఈ మేరకు వీలునామా రాసి ఇవ్వాలని ఆమె పట్టుబట్టారు. కానీ, దీనికి శ్రీనివాస్ అభ్యంతరం చెబుతున్నారు. తనకున్న ఆస్తి కొత్తిల్లు మాత్రమేననని.. దీనిని రాసిస్తే.. తన ఫ్యూచర్ ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది.
కారణం ఏంటి?
కొత్త ఇంటి వ్యవహారంలో దువ్వాడ ఇంత పట్టుబట్టడానికి కారణం.. ఈ ఇంటి నిర్మాణానికి మాధురి సొమ్ములు ఇవ్వడమేనని తెలుస్తోంది. ఈ విషయాన్ని మాధురే మీడియా ముందు చెప్పుకొచ్చారు. కొత్త ఇంటిపై తనకే హక్కు ఉందని ఆమె తెలిపారు. అంతేకాదు.. ఈ ఇల్లు కావాలంటే వాణి సంబధిత పత్రాలు తీసుకురావాలని సవాల్ విసిరారు. అందుకే ఈ విషయంలో శ్రీనివాస్ వెనుకంజ వేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో దువ్వాడ ఫ్యామిలీ సెటిల్మెంట్ వ్యవహారంలో బ్రేక్ పడింది. చివరకు ఏం తేలుతుందో చూడాలి.