లాయర్ మాట్లాడతారు. కోర్టులో తన వాదనలతో తన క్లయింట్ కు సంబంధించిన వాదనల్ని వినిపిస్తారు. మొత్తంగా లాయర్ అన్నంతనే మాటలే ముఖ్యం. కానీ.. మాట్లాడలేని మూగ లాయర్ తన వాదనల్ని ఎలా వినిపిస్తారు? అందునా.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంలో అంటే పరిస్థితి మరెలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటివేళ.. ఒక మూగ లాయరమ్మ తన వాదనల్ని వినిపించేందుకు చేసిన ప్రయత్నాల్ని సుప్రీంకోర్టు చీప్ జస్టిస్ అనూహ్య రీతిలో రియాక్టు అయ్యారు. సానుకూలంగా స్పందిస్తూ.. ఆమె వాదనల్ని సంజ్ఞల భాషలో చేయగా.. వాటిని మాటల రూపంలో చెప్పేందుకు ఒక అనువాదకుడికి అవకాశం ఇచ్చిన అరుదైన ఘట్టం సుప్రీంలో చోటు చేసుకుంది.
కేరళకు చెందిన సారా సన్నీ పుట్టుకతోనే వినికిడి లోపం ఉంది. అయినప్పటికి ఆమెకు లాయర్ కావాలన్నది ఆశయం. అందుకు తగ్గట్లే ఆమె లా డిగ్రీని సొంతం చేసుకొని.. ప్రముఖ న్యాయవాది సంచితా అయిన్ వద్ద జూనియర్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక కేసు విచారణలో భాగంగా వర్చువల్ పద్దతిలో తన సీనియర్ తో కలిసి వాదనలకు హాజరయ్యారు. వాదోపవాదనలు ఆమెకు అర్థమయ్యేందుకు భారతీయ సంజ్ఞల భాష వ్యాఖ్యత సౌరవ్ రాయ్ చౌధురిని ఏర్పాటు చేశారు.
విచారణ వేళ.. సౌరవ్ వివరిస్తున్న వేళ.. ఆ తీరుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో.. వ్యాఖ్యాతను అనుమతించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ను సారా సీనియర్ సంచిత అభ్యర్థించారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ ఆమోదాన్ని తెలియజేశారు. దీంతో సారా తన వాదనల్నిసంజ్ఞలతో చెప్పటం.. ఆ వెంటనే రాయ్ తన మాటల్లో చెప్పటాన్ని చూసిన సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతా ఆయన వేగాన్ని అభినందించారు. దివ్యాంగ న్యాయవాదులకు ప్రత్యేక వెసులుబాటు పొందేలా అనుమతులు ఇచ్చిన సీజేఐకు సన్నీ.. సారాలు థ్యాంక్స్ చెప్పారు. రానున్న రోజుల్లో సారా మాత్రమే కాదు.. ఆమె లాంటి దివ్యాంగులు లాయర్లుగా రాణించేందుకు ఒక అవకాశం ఇచ్చినట్లు అయ్యిందని చెప్పాలి.