లెజెండరీ సింగర్, దివంత ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తెలుగువారితో పాటు దేశం గర్వించదగ్గ గొప్ప నేపథ్య గాయకుడు. ఒక ఇంట్లో మూడు తరాలకు చెందిన సంగీత ప్రియులుంటే వారంతా బాలు పాట వినగలిగారంటే ఆయన గాత్రలోని మాధుర్యం ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. ఇక, టాలీవుడ్ లో ఎంతోమంది ఔత్సాహిక యువ గాయనీగాయకులలోని ప్రతిభను గుర్తించడం కోసం బాలు వ్యాఖ్యాతగా నిర్వహించిన ‘పాడుతా తీయగా’ కార్యక్రమం బుల్లితెర చరిత్రలో ఓ కలికితురాయి.
బాలు కేవలం తెలుగు వాడో…భారతీయుడో కాదు…బాలు పాటకు ప్రపంచమంతా అభిమానులున్నారనడానికి తాజా ఘటనే నిదర్శనం. తాజాగా ఓ దుబాయ్ షేక్ బాలు పాటను పొల్లపోకుండా పాడి ఔరా అనిపించగా..ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణంగా అరబ్ దేశాలలో వారికి అరబిక్, కొద్దో గొప్పో ఇంగ్లిష్ వచ్చే అవకాశముంది. ఇక, అరబ్ లు తెలుగులో మాట్లాడడం కొంతవరకు ఓకే అనుకున్నా…ఓ అరబ్ ఏకంగా తెలుగు పాటను పాడి అందరినీ అవాక్కయ్యేలా చేశారు.
కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిరివెన్నెల’ చిత్రానికి కె.వి.మహదేవన్ నభూతో నభవిష్యత్ అన్న రీతిలో అందించిన సంగీతం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆ చిత్రంలోని అన్ని పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచిపోయాయి. ఈ సినిమాలో బాలు పాడిన ‘విధాత తలపున..’పాట ఎందరికో ఆల్ టైం ఫేవరైట్ సాంగ్. ఈ నేపథ్యంలోనే బాలుగారిపై అభిమానంతో తాజాగా దుబాయ్ కు చెందిన ఓ షేక్ ఆ పాటను ఆలపించారు.
మామూలుగా అయితే తెలుగులో నాలుగు ముక్కలు చెప్పడానికే ఆపసోపాలు పడే దుబాయ్ షేక్….ఈ పాటను పొల్లుపోకుండా పాడి అబ్బురపిచాడు. తన పాట వీడియోను ఆయన టిక్‌టాక్‌లో షేర్ చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సంగీతంపై ఆ దుబాయ్ షేక్ కు ఉన్న అభిరుచికి తెలుగువారితోపాటు సంగీత అభిమానులంతా ఫిదా అయిపోయారు. దీంతో, ప్రస్తుతం దుబాయ్ షేక్ పాట…ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.