మందుబాబులం మేము మందు బాబులం….మందుకొడితే మాకు మేమె మగారాజులం…..తాగుబోతంటే ఎందుకంత చులకన….తాగి వాగేది పచ్చినిజం గనకన…..అంటూ తాగుబోతోళ్ల గురించి గొప్పగా రాశాడో సినీకవి. ఇక, తాము ట్యాక్స్ పేయర్లమని, గవర్నమెంట్ కు ప్రతిరోజు ట్యాక్స్ కడుతున్నామని, తమనపు తాగుబోతులంటూ అవమానించొద్దని మరో సినిమాలోని డైలాగులు నవ్వు తెప్పించక మానవు.
ఇలా, ప్రతి రాష్ట్రంలోని ఖజానాను నింపేందుకు తమ ఒళ్లుగుల్ల చేసుకుంటున్న ట్యాక్స్ పేయర్లను తాజాగా బిహార్ సీఎం నితీష్ కుమార్ ఘోరంగా అవమానించడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.మద్యం సేవించే వారిని ఉద్దేశించి నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మందు తాగే వారు మహా పాపులని, ఇంకా చెప్పాలంటే మందుబాబులు తన దృష్టిలో భారతీయులే కాదని నితీశ్ కుమార్ షాకింగ్ కామెంట్లు చేశారు.
బాపూజీ మద్యపానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని, గాంధీజీ సిద్ధాంతాలకు తూట్లు పొడిచేవారిని తాను భారతీయులుగా పరిగణించనని అన్నారు. అంతేకాదు, విషంతో సమానమైన మద్యం సేవించడం హానికరమని తెలిసీ కొందరు సేవించి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని, ఆ తరహా పర్యవసానాలకు వారే బాధ్యులని చెప్పారు. మందుబాబుల విషయంలో తమ ప్రభుత్వం ఉదాసీనంగా ఉండబోదని, మద్యం సేవించి మరణించిన వారి కుటుంబాలను తమ ప్రభుత్వం ఆదుకోదని, పరిహారం చెల్లించే ప్రసక్తే లేదని బల్లగుద్ది మరీ చెప్పారు.
అసెంబ్లీలో బిహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు- 2022ను కఠినతరం చేసే క్రమంలో జరిగిన చర్చ సందర్భంగా నితీశ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మద్యపాన నిషేధం అమల్లో ఉన్న బిహార్ లో తాజాగా ఈ బిల్లు గవర్నర్ ఆమోదం పొందింది. ఆ బిల్లు ప్రకారం మందేసి తొలిసారి పట్టుబడితే జరిమానా, ఒక నెల జైలు శిక్ష విధిస్తారు. బీహార్ లో మద్య నిషేధం ఉన్నా కల్తీ మద్యం, కల్తీ సారా ఏరులై పారుతుండడంతో తాజాగా నిబంధనలు కఠినతరం చేశారు.