సూర్య నటించిన సెవెన్త్ సెన్స్ సినిమా చూశారా? చైనాలో విష జ్వరం ఒకటి జనాల్ని చంపేస్తుంటే.. భారతీయ ఆయుర్వేదంతో బతికించటం గుర్తుందా? ఇప్పుడు చెప్పే ఉదంతం గురించి విన్నంతనే ఆ సినిమా చప్పున గుర్తుకు వస్తుంది. ప్రధాన మీడియాలో పెద్దగా ఫోకస్ కాలేదు.
సోషల్ మీడియాలో.. వాట్సాప్ గ్రూపుల్లో మాత్రం ఇప్పుడు ఒకటే చర్చ.. కృష్ణపట్నం ఆనందయ్య. ఆయన తయారు చేసే కరోనా నాటు మందు కోసం వేలాది మంది ఎగబడుతున్నారు. ఎంతలా అంటే.. నెల్లూరు జిల్లా ఆసుపత్రిలో బెడ్లు మొత్తం ఖాళీ అయి..ఈ నాటు (ఆయుర్వేద) మందు కోసం బారులు తీరుతున్నారు.
కిలోమీటర్ల కొద్దీ జనంతో అక్కడి రహదారులు కిటకిటలాడుతున్నాయి. అక్కడి వీడియోలు చూస్తే.. ఈ మందు కోసం ఉన్న డిమాండ్ ఎంతన్నది కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది.
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం మేజర్ పంచాయితీ. ఇక్కడ 11వేల మంది జనాభా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రాంతానికి చెందిన ఆనందయ్య సహజ మూలికలతో కరోనా మందును తయారు చేసినట్లు చెబుతారు.
ఆయన తయారు చేసిన మందును వాడిన వారెవరికి కరోనా రాలేదని చెబుతున్నారు. ఇక.. కరోనా వచ్చినోళ్లకు ఈ మందు వాడితే కేవలం రెండు రోజుల్లో కరోనా తీవ్రత తగ్గిపోతుందని చెబుతున్నారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. 11 వేల మంది ప్రజలున్న కృష్ణపట్నంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని చెబుతారు.
ఇక్కడున్న పోర్టు నుంచి ఇతర రాష్ట్రాలకు రవాణా నిరంతరం కొనసాగుతున్నా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవటమన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే.. అధికారికంగా ప్రభుత్వం ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు.
కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు కోసం తాజాగా 50-60 వేల మంది వరకు నిరీక్షిస్తున్నారు. వారికున్న వనరుల ప్రకారం రోజుకు 5వేల మందికి మందు ఇవ్వగలరని చెబుతున్నారు. స్థానిక మీడియా అందిస్తున్న సమాచారం ప్రకారం 2వేల అంబులెన్సులు బారులు తీరినట్లుగా చెబుతున్నారు. ఎంత సీరియస్ కండీషన్ లో ఉన్నా.. ఈ మందు వాడితే కరోనా తీవ్రత తగ్గుతుందన్న ప్రచారంతో వేలాది మంది పోటెత్తుతున్నారు.
ఇదిలా ఉంటే కృష్ణపట్నం మందు మీద ఏపీ సర్కారు కమిటీని నియమించింది. ఉచితంగా పంపిణీ చేస్తున్న ఈ మందులోని అంశాల్ని పరిశీలించిన కమిటీ తన రిపోర్టును అందించింది. అందులోని అంశాల్ని చూస్తే.. మందును తయారు చేసిన అనందయ్యకు విద్యార్హతలు లేవని.. ఆయుర్వేద ప్రమాణాల్ని పాటించలేదని పేర్కొన్నారు. అయితే.. ప్రజల నుంచి సానుకూల స్పందన ఉందన్న విషయాన్ని స్పష్టం చేశారు.
ఈ మందుపై మరింత లోతైన పరిశోధన చేయాలని.. కొవిడ్ కేర్ సెంటర్ లో కోవిడ్ బాధితులకు ఇతర మందులు ఇవ్వకుండా..ఈ మందును మాత్రమే ఇచ్చి పరిశీలించటం ద్వారా దీని సామర్థ్యం ఏమిటో తెలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది.
అదే సమయంలో మందు తయారీలో సాధారణ పదార్థాలే వాడారని.. కంట్లో వేసే చుక్కల మందుతో దీర్ఘకాలంలో ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ మందు వాడిన ప్రజల నుంచి ఎలాంటి ఆరోపణలు లేవని.. ఒక వ్యక్తికి మాత్రం ఆక్సిజన్ లెవెల్స్ పెరిగిన విషయాన్ని గుర్తించారు. రిపోర్టు సానుకూలంగా రావటంతో.. ప్రభుత్వమే ఈ మందును పంపిణీకి సహకరిస్తుందన్న మాట వచ్చింది.
రోజుకు తాము మూడు వేల మందికి మాత్రమే మందును తయారు చేసి ఇచ్చే సామర్థ్యం ఉందని నిర్వాహకులు చెబుతున్నా.. వేలాది మంది ప్రజలు ఈ మందు కోసం ఎగబడుతున్నారు. వేలాది వాహనాలతో భారీ ట్రాఫిక్ జాం చోటు చేసుకుంది.
పరిస్థితిన సమీక్షించేందుకు స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి గ్రామానికి రావటం.. పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. ఈ ఆయుర్వేద మందును పంపిణీ చేసే ప్రాంతంలో పరిస్థితిని అదుపు చేయటం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. మొత్తంగా ఏపీ వ్యాప్తంగానే కాదు తెలంగాణలో కూడా ఈ మందు మీద పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తమవుతోంది.
తాజాగా ప్రభుత్వం ఈ ఆయుర్వేద మందు పంపిణీ నిలిపివేసింది. దీనిలో వాస్తవికత పరిశోధన చేయడానికి శాంపిల్స్ హైదరాబాదు పంపింది. దీంతో రోగులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. రెండ్రోజుల నుంచి వేచి చూస్తున్న వారు గవర్నమెంటు తీరుపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.
కొందరు ఒకడుగు ముందుకేసి డ్రగ్ మాఫియా పనే ఇది. డ్రగ్ మాఫియా దెబ్బకు ఆనందయ్య కరోనా వైద్యం మూతపడింది అని ఆరోపించేస్తున్నారు.
ప్రభుత్వం దీనిపై ఐసీఎంఆర్ శాస్త్రీయ పరిశోధన చేయాల్సి ఉందని, ఆ పరిశోధనలో వెల్లడయ్యే అంశాల ఆధారంగానే… ఆయుర్వేదం మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయిస్తామని తెలిపారు. అప్పటివరకు మందు పంపిణీకి అనుమతి లేదని స్పష్టం చేశారు.
మొత్తానికి ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదు. ఒకటైతే నిజం. కొన్ని నెలలుగా ఆశాదీపంలా అందరికీ చిటికెలో కరోనా నయమయ్యే సంజీవనికి తాత్కాలికంగా బ్రేక్ పడింది.
ఆనందయ్య మందు పంపిణీని ఆపేది మీరే..ప్రారంభిస్తున్నామని ప్రకటించేది మీరే..తిరిగి లాఠీచార్జీ చేసేది మీరే..సాఫీగా సాగిపోయే కార్యక్రమాన్ని గందరగోళం చేయకండని అధికారులకు, @ysjagan ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.. pic.twitter.com/bpnhl03nBm
— Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) May 21, 2021