ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కూటమి గెలుపు కోసం విదేశాల నుంచి ప్రవాసాంధ్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు లక్షలాదిగా తరలివచ్చారు. ముఖ్యంగా టీడీపీకి మద్దతుగా ఎన్నారై టీడీపీ నేతలు, సానుభూతిపరులు భారీ సంఖ్యలో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి మరీ ఓటేసి కూటమి విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే కూటమి అఖండ విజయంపై ఎన్నారై టీడీపీ అధ్యక్షుడు ‘డాక్టర్ రవి వేమూరి’ స్పందించారు.
కూటమి విజయం పట్ల ‘డాక్టర్ వేమూరి’ హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు, జనసేనాని పవన్ కల్యాణ్ కు, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు, కూటమి నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఐదేళ్లుగా టీడీపీ గెలుపు కోసం ఎన్నారైలు పడిన కష్టం వృథా కాలేదని, ఈ అఖండ విజయంలో ఎన్నారైల పాత్ర మరువలేనిదని చెప్పారు. కూటమి గెలుపు కోసం ఎన్నారైలు పడిన కష్టం ఫలించిందని అన్నారు. టీడీపీ ఎన్నారై నేతలు రాధా కృష్ణ రావి, బుచ్చిరాం ప్రసాద్, సాగర్ దొడ్డపనేని, డీవీ రావు, మల్లిక్ మేదరమెట్ల, శేషుబాబు, రాజ శేఖర్ చప్పిడిలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కూటమి గెలుపు కోసం కష్టపడిన వారందరి పేర్లు రాసే ఆస్కారం లేనందున వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెప్పారు.
టీడీపీ కూటమి విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు రాత్రంతా ఒక పండుగలాగా జరుపుకున్నారని తెలిపారు. అమరావతి రాజధాని, పోలవరం, నవ్యాంధ్ర పునర్నిర్మాణంలో ఎన్నారైల మద్దతు కూటమి ప్రభుత్వానికి ఎల్లపుడూ ఉంటుందని చెప్పారు. ఏపీ డెవలప్మెంట్ కోసం ఎన్నారైలు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారని అన్నారు.