భారత ప్రధాని నరేంద్ర మోడీ నివాసం దగ్గర డ్రోన్ సంచరించిన వ్యవహారం కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో ప్రధాని నివాసం మీదుగా అనుమానాస్పద డ్రోన్ ఎగరడాన్ని భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ వ్యవహారంపై ప్రధాని నివాసానికి భద్రతను అందిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) నుంచి తమకు సమాచారం అందిందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఆ డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయంపై విచారణ చేస్తున్నామని చెప్పారు.
ఢిల్లీలో 7 లోక్ కల్యాణ్ మార్గ్ లో భారత ప్రధాని అధికారిక నివాసం ఉంది. నో ఫ్లై జోన్ అమల్లో ఉన్న ఈ ప్రాంతంలో డ్రోన్లతో పాటు ఎగిరే వస్తువుల సంచారంపై నిషేధం అమల్లో ఉంది. దాంతోపాటు అత్యంత పకడ్బందీగా భద్రత ఉండే ఈ ప్రాంతంలో డ్రోన్ రావడంపై భద్రతా సిబ్బంది షాక్ అవుతున్నారు. అయితే, డ్రోన్ కదలికలపై తక్షణమే అప్రమత్తమైన ఎస్పీజీ సిబ్బంది ఆ డ్రోన్ ను ట్రాక్ చేయడం మొదలుపెట్టారు. ఢిల్లీ పోలీసులతో కలిసి ఎస్పీజీ సిబ్బంది జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. అయితే, ఆ డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏమిటి అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది.
తమ ఆపరేషన్ లో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని, డ్రోన్ ఎగిరిందా లేదా అని నిర్ధారించుకోవడానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ను కూడా సంప్రదించామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. అయితే, ప్రధాని నివాసం దగ్గర ఎటువంటి ఎగిరే వస్తువును గుర్తించలేదని ఏటీసీ అధికారులు వెల్లడించినట్టు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. దీంతో, ప్రధాని మోడీ నివాసంపై డ్రోన్ ఎగిరిందా లేదా అన్న విషయంపై సందిగ్ధత ఏర్పడింది. ఈ ఏడాది ఏప్రిల్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటిపై కూడా అనుమానాస్పద డ్రోన్ సంచరించింది. కేజ్రీవాల్ నివాసం కూడా నో ఫ్లై జోన్ లోనే ఉంది.